
ప్రభుత్వంలో ఓ నలుగురు సీనియర్ ఐఏఎస్‌ల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వహయాంలో అత్యంత కీలక శాఖల్లో కొనసాగుతూ నాటి సర్కార్ పెద్దలతో అంటకాగిన వారినే.. ఈ ప్రభుత్వంలో అవే ప్రాధాన్య శాఖల్లో కొనసాగిస్తుండడం వల్లే వారి ఆగడాలు పెరిగిపోతున్నాయనే వాదనలు ఉన్నాయి. ప్రభుత్వానికి తాము తప్ప వేరే గత్యంతరం లేదని భావిస్తున్న ఈ ఉన్నతాధికారులు.. తామే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, తమ పరిధిలో లేని శాఖల్లోనూ తలదూరుస్తూ తమ కింది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కీలక శాఖలన్నీ వారి గుప్పిట్లోనే..
గత ప్రభుత్వంలో నెంబర్ 2గా పేరుగాంచిన ఒక మంత్రి శాఖను చూసిన సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రస్తుత ప్రభుత్వంలోనూ అదే శాఖలో కొనసాగిస్తున్నారు. గత సర్కారు పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను కొనసాగించడమే కాకుండా.. ఇటీవల జరిగిన బదిలీల్లో సీఎంవోకు తీసుకురావడం విశేషం. అక్కడ కూడా అదే శాఖకు సంబంధించిన ఒక కీలక విభాగాన్ని ఏర్పాటు చేసి, ఆయనను హెడ్‌గా నియమించడం చర్చనీయాంశంగా మారింది. మరో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా గత ప్రభుత్వంలో కీలక శాఖ నిర్వహించగా, భూముల వ్యవహారాల్లో ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
ఇటీవల జరిగిన బదిలీల్లో ఆ అధికారి శాఖ మారుతుందని భావించినా ఆయనను కదలించకపోవడం గమనార్హం. దీంతో ఆ అధికారి ఎప్పట్లాగే పాత శాఖను చూస్తున్నారు. గత్యంతరం లేకే కొనసాగించాల్సి వస్తోందని, ఇలాంటి అధికారులను బదిలీ చేస్తే ఇబ్బంది అవుతుందని స్వయంగా సీఎం చెప్పారంటే ఆ సీనియర్ఐఏఎస్ల కోటరీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పని చేశారు. కీలక శాఖలను నిర్వహించిన ఆయనకు, ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం కలిగిన పోస్టులే దక్కుతున్నాయి.
ఒక్క ఫైనాన్స్ శాఖ మాత్రమే కాకుండా నాలుగైదు శాఖల అదనపు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించడం గమనార్హం. తాజాగా ఒక ముఖ్యమైన శాఖకు హెచ్‌ఓడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ కావడం ప్రభుత్వంలో ఆయనకు ఉన్న ప్రాబల్యాన్ని తెలియజేస్తోంది. మరో సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఆ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న ఆయనకు కూడా ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం దక్కింది.
సలహాదారుడిగా ఉండి ఇప్పుడు ఏకంగా సీఎం ప్రిన్సిపాల్ సెక్రటరీగా పోస్టింగ్ పొంది వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈయన అన్ని శాఖల్లోనూ తలదూరుస్తారని, తెలంగాణ ఐఏఎస్‌ల పట్ల వివక్ష చూపిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు చూసిన ముఖ్యమైన శాఖలను ఇప్పుడు సీఎంవోలోనూ ఆయనకే అప్పగించడం విశేషం.