- చెన్నై ఎఫ్‌సీఐ జోనల్ ఆఫీసుకు ఫిర్యాదులు
- విధుల్లో నిర్లక్ష్యం వహించిన 20 మంది ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్, వెలుగు: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) ద్వారా తెలంగాణ నుంచి సరఫరా చేసిన బియ్యంలో పురుగులు ఉన్నట్లు తేలింది. దీనిపై చెన్నైలోని జోనల్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌సీఐ స్పందించింది. బాధ్యులైన అధికారులు, టెక్నికల్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా అయిన బియ్యం వ్యాగన్లలోని కొన్నింటిలో ఖాప్రా అనే పురుగు ఉన్నట్లు గుర్తించారు. బియ్యం పురుగు పట్టి ఉన్నట్టు చెన్నై ఎఫ్‌సీఐ ప్రాంతీయ కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి.
దీంతో స్పందించిన ఎఫ్‌సీఐ ఆరుగురు మేనేజర్లు, 14 మంది టెక్నికల్ అసిస్టెంట్లను ఈ సీజన్ ముగిసే వరకు ప్రొక్యూర్‌మెంట్ విధుల్లోంచి తొలగించింది. అదేవిధంగా మిగతా జిల్లాల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చైన్నై జోనల్ కార్యాలయానికి 17 ఫిర్యాదులు అందాయి. ప్రధానంగా కేరళ రీజియన్‌లో, తమిళనాడు, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణలోని నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ గోదాముల నుంచి సరఫరా అయిన సీఎంఆర్ బియ్యంలో లార్వా ఉన్న ఖాప్రా పురుగు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.