‘మహిళా దర్బార్​’లో గవర్నర్​కు వినతుల వెల్లువ

 ‘మహిళా దర్బార్​’లో గవర్నర్​కు వినతుల వెల్లువ

హైదరాబాద్, వెలుగు: రాజ్​భవన్​లో గవర్నర్ తమిళిసై నిర్వహించిన ‘మహిళా దర్బార్’కు భారీ స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి పైగా మహిళలు, వృద్ధులు, వివిధ ప్రజా సంఘాలు, పార్టీలు, మహిళా సంఘాల ప్రతినిధులు వచ్చి వినతిపత్రాలు అందజేశారు. మహిళా దర్బార్​ ఏర్పాటు చేయడంపై గవర్నర్​కు ధన్యవాదాలు తెలిపారు. మంచి కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారని, తెలంగాణ మహిళలకు సోదరిగా సేవ చేస్తున్నారని అన్నారు.  

శుక్రవారం 12 గంటలకు కార్యక్రమం ఉంటే ఉదయం 10 గంటల నుంచే రాజ్ భవన్ కు వచ్చి తమ సమస్యలను రాజ్ భవన్ అధికారులకు తెలిపి అప్లికేషన్ లో ఫిల్ చేశారు. మహిళలను స్టేజ్ మీదకు పిలిపించుకొని వారి సమస్యలను గవర్నర్  తెలుసుకున్నారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వినతిపత్రాలు స్వీకరించారు. పలువురు వృద్ధులు గవర్నర్ కు తమ సమస్యలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

 రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, భూ కబ్జాలు, వరకట్న వేధింపులు, టీఆర్ ఎస్ నేతల భూకబ్జాలు, 317 జీవో, ఉద్యోగుల బదిలీ వంటి పలు సమస్యలు గవర్నర్ దృష్టికి వచ్చాయి.  పలు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన విరాళాలు రూ. 2 కోట్లు ఉన్నాయని, వాటి నుంచి ఆర్ధిక సహాయం చేస్తామని బాధితులకు గవర్నర్  భరోసా ఇచ్చారు. సమస్యలు పరిష్కరించేందుకు పలువురు రెడ్ క్రాస్ యూనిట్ సభ్యులను, డాక్టర్లను, లాయర్లను గవర్నర్ రాజ్ భవన్ కు ఆహ్వానించారు. ఆయా సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను వారికి అందజేశారు. 

‘మహిళా దర్బార్’​కు అందిన వినతుల్లో కొన్ని..

  •  “దిశ ఘటన జరిగినప్పుడు నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్ లో బాలికపై జరిగిన అఘాయిత్యంలో పెద్ద నేతల కొడుకులు ఉన్నారనే  ఆరోపణలు ఉన్నాయి. నిందితులను తప్పించే కుట్ర జరుగుతున్నది. బాధిత కుటుంబానికి న్యాయం చేయండి” అని హైదరాబాద్​లోని నాగోల్​కు చెందిన స్వర్ణలత గవర్నర్ ను కోరారు.  
  •     “తప్పుడు కేసులతో వేధింపులకు గురిచేశారు. మాకు న్యాయం చేయండి” అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి కుటుంబసభ్యులు గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. మంత్రి అవినీతిపై ఆధారాలతో వినతిపత్రం అందజేశారు. 
  •     “ నేను నల్గొండ జిల్లాలో పుట్టిన, నా స్టడీ అంతా అక్కడే పూర్తయింది. 317 జీవోతో నాకు నిజామాబాద్ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. నాకు ఏడాది బాబు, ఐదేండ్ల పాప ఉంది. తల్లిదండ్రులు లేరు. అంత దూరం వెళ్లి నేను డ్యూటీ ఎలా చేయాలి. నా సమస్యను పరిష్కరించండి” అని నల్గొండ జిల్లాకు చెందిన లెక్చరర్ ఉదయశ్రీ తన ఏడాది బాబుతో మహిళా దర్బార్ కు వచ్చి గవర్నర్​కు వినతిపత్రం అందజేశారు. 
  •     “రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్​ఏలకు పే స్కేల్ ఇస్తామని 2017లో ప్రగతి భవన్​ లో, 2020లో అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఈ హామీ అమలు కావడం లేదు. సహకరించండి” అని గవర్నర్​ను మహిళా వీఆర్ఏలు కోరారు. రాష్ట్రంలో 5 వేల మంది మహిళలు వీఆర్​ఏలుగా పని చేస్తున్నారని, ప్రసూతి, సాధారణ సెలవులు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.  
  •     “తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న. రెండు సార్లు అరెస్ట్ అయిన. ఈ ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం అయ్యేలా కనిపించటం లేదు. బయటకు వెళ్తే పోలీసులు అరెస్టు చేస్తున్నరు” అని ఓల్డ్ సిటీకి చెందిన సాజిత గవర్నర్ కు తెలిపారు.