
హైదరాబాద్, వెలుగు : జులై నెలాఖరులోగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ను ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సెక్రటేరియెట్‌లో అటవీ, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సీఎస్ సమావేశమై చర్చించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం అమలు చేయాలని ఆదేశించారు. కాగితపు సంచులు, గుడ్డ, జనపనార సంచులు, విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో ప్రచారంతో పాటు పంచాయతీలలో, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. టైగర్ రిజర్వ్ ఏరియాలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం గురించి హైవే వెంట ఉన్న స్థానిక వ్యాపారులకూ అవగాహన కల్పించాలన్నారు. టైగర్ రిజర్వ్ పరిధిలోని నాలుగు ఆవాసాల్లో నివాసముంటున్న ప్రజలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. హరిత నిధి కింద ఉన్న నిధులను సంబంధిత ఏడాదిలోనే వినియోగించుకోవాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మైసమ్మ దేవాలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ శాఖ అధికారులను సీఎస్ కోరారు.