
- అక్కడ టికెట్ రాకపోతే తమ పార్టీలోకి వస్తారని ఎదురుచూపులు
- అభ్యర్థుల జాబితా విడుదల చేయని బీఎస్పీ, వైఎస్సార్‌టీపీ, ఫార్వర్డ్ బ్లాక్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ తప్పా ఏ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేయలేదు. తొలుత బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థులతో లిస్ట్ ప్రకటించగా.. ఇప్పటిదాకా 105 మందికి బీఫామ్స్‌ను సీఎం కేసీఆర్ అందజేశారు. కాంగ్రెస్ పార్టీ 55 మందితో లిస్ట్ విడుదల చేయగా, బీజేపీ ఇంకా ప్రకటించలేదు. బీఎస్పీ 20 మందితో లిస్ట్ విడుదల చేసింది. ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతుండటం, టికెట్ దక్కని నేతలు ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉండటంతో.. లిస్టు ప్రకటన విషయంలో వేచి చూసే ధోరణిలో పార్టీలు ఉన్నాయి.
బీఎస్పీ, వైఎస్సార్‌టీపీ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ తదితర పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఆయా పార్టీల్లో టికెట్లు దక్కని నేతలు తమ పార్టీలోకి వచ్చి పోటీ చేస్తారని ఈ మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బహుజన నినాదంతో ప్రధాన పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెలాఖరుకు లేదా నామినేషన్లు స్టార్ట్ అయ్యే నాటికి మిగతా అభ్యర్థుల లిస్టును వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాంగ్రెస్‌తో విలీనం/పొత్తు తేలకపోవటంతో ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు వైఎస్సార్‌టీపీ చీఫ్ షర్మిల ప్రకటించారు. అన్ని నియోజకవర్గాలకు కలిపి ఇప్పటి వరకు 379 అప్లికేషన్లు వచ్చినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. మరోవైపు ఈవీఎంలలో ముందు ఉండే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కూడా ఈ సారి చాలా మంది నేతలు పోటీ చేయనున్నట్లు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచిన నేపథ్యంలో ఈ పార్టీ బీఫామ్‌లకు డిమాండ్ పెరిగింది.