రాయబారాలు, బేరసారాలు..పోటీదారులను బరిలో నుంచి తప్పించేందుకు యత్నాలు

రాయబారాలు, బేరసారాలు..పోటీదారులను బరిలో నుంచి తప్పించేందుకు యత్నాలు
  •  కుల సంఘాలు, వీడీసీలు, బంధువులతో ఒత్తిళ్లు
  • నజరానాలు, ఉపసర్పంచ్ పదవుల పేరిట బుజ్జగింపులు
  •  పంచాయతీ ఎన్నికల్లో రోజుగా రాజకీయాలు 

నిర్మల్, వెలుగు: పంచాయతీ ఎన్నికల వేళ పల్లెల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమ పోటీదారులను కాంప్రమైజ్ ​చేసేందుకు కొందరు రాయబారాలు, బేరసారాలు సాగిస్తున్నారు. ఈసారి తనకు సర్పంచ్ పదవికి ఛాన్స్ ఇస్తే తర్వాత జరిగే ఎన్నికల్లో తాను, తన వర్గమంతా సపోర్ట్ చేస్తుందంటూ పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. లేదంటే ఈసారి ఉపసర్పంచ్ పదవి తీసుకోవాలని, ఐదేండ్ల తర్వాత సర్పంచ్ పదవిని కట్టబెడతామంటూ హామీలు ఇవ్వడమే కాకుండా ప్రమాణాలు కూడా చేస్తున్నారు. 

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో నిలుపుతామని భరోసా..

నిర్మల్ ​జిల్లాలో ‘కాంప్రమైజ్’​ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఒకే కులం నుంచి ఇద్దరు ముగ్గురు నామినేషన్ దాఖలు చేసినట్లయితే వారిలో నుంచి ఒక్కరినే పోటీలో ఉంచేలా ఆ కుల సంఘ పెద్దలు, వీడీసీ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరినీ, సమీప బంధువులను ఒకే చోటకు రప్పించి మంతనాలు జరుపుతున్నారు. ఇప్పుడు పోటీ నుంచి తప్పుకుంటే రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో నిలుపుతామని భరోసా ఇస్తున్నారు. 

ఇక పలు గ్రామాలలో తమ ప్రత్యర్థులను ఎన్నికల బరి నుంచి తప్పించేందుకు పెద్ద మొత్తం లో బేరసారాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.లక్షల్లో కాంప్రమైజ్ పాలిటిక్స్ సాగుతున్నాయని సమాచారం. కొన్నిచోట్ల నగదుతోపాటు ప్లాట్లు కూడా ఇచ్చేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

అత్తా కోడళ్లు.. అన్నదమ్ముల మధ్య కాంప్రమైజ్ యత్నాలు

ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామపంచాయతీకి బలగం గంగవ్వ, బలగం వరలక్ష్మి అనే అత్తా కోడళ్లు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో బంధు గణమంతా ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై హైరానా పడుతున్నారు. దీంతో కుల పెద్దలు, కుటుంబ పెద్దలు రంగంలోకి దిగి వీరిద్దరి మధ్య కాంప్రమైజ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరిద్దరితో మాట్లాడి ఎవరో ఒకరు పోటీ నుంచి విరమించుకోవాలని కోరుతున్నారు. 

బుధవారం నాటికి వీరిలో ఒక్కరు మాత్రమే రంగంలో ఉండే అవకాశాలున్నాయి. ఇక సూర్జాపూర్ గ్రామపంచాయతీలో సోదరులైన గాజుల గంగన్న, శ్రీనివాస్ సర్పంచ్ పదవి కోసం నామినేషన్​ వేశారు. వీరిని కూడా కాంప్రమైజ్ చేసేందుకు కుటుంబ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.