మేడ్చల్ లో  డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన 

మేడ్చల్ లో  డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన 
  • అయినోళ్లకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన్రు
  •     సమాచారం ఇవ్వకుండానే డ్రా తీసిన్రు 
  •     మేడ్చల్ మున్సిపల్​ ఆఫీసులో లబ్ధిదారుల ఆందోళన 

మేడ్చల్, వెలుగు: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లను బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వాళ్లకే ఇచ్చారని ఆరోపిస్తూ లబ్ధిదారులు శనివారం మున్సిపల్ ఆఫీసులో ఆందోళన చేశారు. శనివారం మేడ్చల్ మున్సిపల్ ఆఫీసులో మండల తహసీల్దార్ సరిత సమక్షంలో డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి డ్రాను తీశారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ.. దరఖాస్తుదారులమైన తమకు సమాచారం ఇవ్వకుండానే డ్రా తీశారని ఆరోపించారు. తమకు ఇండ్లు దక్కుతాయని ఇన్నేండ్లుగా ఎదురుచూశామని, కానీ ఇప్పుడు ఇలా జరిగిందంటూ పలువురు కన్నీరుమున్నీరయ్యారు. డ్రా వెనుక కుట్రలు జరిగాయని ఆరోపించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు కావాల్సిన వారికే ఇండ్లు దక్కాయన్నారు. నాలుగేండ్లుగా డబుల్ బెడ్రూం ఆశలు చూపి ఇప్పుడు ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మేడ్చల్ ఎమ్మార్వో సరితను వివరణ కోరగా.. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా డ్రా ప్రక్రియ కొనసాగినట్లు వెల్లడించారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలో 3,100 దరఖాస్తులు రాగా అందులో అర్హులైనవారు 665 మందిని ఎంపిక చేశామని, వారిలో డ్రా తీయగా 80 మందికి ఇండ్లు దక్కినట్లు తెలిపారు.