ఓరుగల్లులో పక్కదారి పట్టిన దళిత బంధు స్కీం

ఓరుగల్లులో పక్కదారి పట్టిన దళిత బంధు స్కీం

వరంగల్‍ : ఓరుగల్లులో దళితబంధు స్కీం పక్కదారి పడుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. వారి చుట్టాలు, లీడర్లను పథకానికి ఎంపిక చేస్తుండడంతో అర్హులైన పేదలు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా నచ్చినవారి పేర్లతో జాబితా తయారు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‍ఎస్‍ కేడర్‍కు అప్పనంగా లక్షల రూపాయలు కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో జిల్లా కలెక్టర్లు ఉంటున్నా పూర్తిగా ఎమ్మెల్యేల పెత్తనం కొనసాగుతోంది. ఎమ్మెల్యేల అన్నదమ్ములు, దగ్గరి చుట్టాలు, సిటీలో అయితే కోట్లు ఖర్చుపెట్టే స్థాయిలో ఉండే కార్పొరేటర్లు, గులాబీ పార్టీ లీడర్లు, వడ్డీ వ్యాపారులు, గ్రామాల్లో సర్పంచులు, పార్టీ అధ్యక్షులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైన బయటివారికి ఇస్తే.. 20 నుంచి 40 శాతం వరకు అనుచరులను ముందుపెట్టి కమీషన్‍ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. 

ఎమ్మెల్యే తమ్ముళ్లు.. గ్రేటర్‍ కార్పొరేటర్లు
స్టేషన్‍ ఘన్‍పూర్‍ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఏకంగా తన తమ్ముడైన ఘన్‍పూర్‍ సర్పంచ్‍, తాటికొండ సురేశ్​ పేరును దళితబంధు పథకానికి సెలక్ట్​చేశారు. ఎంపీపీ భర్త కందుల గట్టయ్యకు సైతం సిఫార్స్​చేశారు. వరంగల్‍ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ ఇద్దరు గ్రేటర్‍ కార్పొరేటర్లు, మరో ఇద్దరు వడ్డీ వ్యాపారులకు కట్టబెట్టారు. 18వ డివిజన్‍ కార్పొరేటర్‍ వస్కుల బాబు, 37వ డివిజన్‍ కార్పొరేటర్‍ వేల్పుగొండ సువర్ణకు పేద దళితుల జాబితాలో కార్లు అందజేశారు. టీఆర్‍ఎస్‍ పార్టీ లీడర్లుగా చెలామణి అవుతున్న వడ్డీ వ్యాపారి జక్కం దాస్‍, పీఆర్‍ సాల్మాన్‍ తో పాటు 20వ డివిజన్‍ కార్పొరేటర్‍ గుండేటి నరేందర్‍ అనుచరుడు సోనూకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. 

నర్సంపేటలో పార్టీ అధ్యక్షులు, సర్పంచులకు..
దళితబంధు స్కీం ప్రారంభం సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి ఖానాపూర్‍ మీటింగ్‍లో మాట్లాడారు. దళితబంధు పథకంలో టీఆర్‍ఎస్‍ కేడర్‍కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని ఓపెన్‍గా చెప్పారు. చెప్పినట్లే సెలక్ట్ చేసిన జాబితాలో అయితే టీఆర్‍ఎస్‍ సర్పంచ్‍ లేదంటే పార్టీ విలేజ్‍ ప్రెసిడెంట్‍ పేర్లను చేర్చారు. ఆయన సొంత గ్రామం నల్లబెల్లి మండలం రామతీర్థం సర్పంచ్‍ కలకోటి కిరణ్‍ తండ్రి రాజయ్య, వార్డ్ మెంబర్‍ కామెర రవి, ఖానాపూర్‍ మండలం బుధరావుపేట టీఆర్‍ఎస్‍ అధ్యక్షుడు నేలమారి నాగరాజు, యూత్‍ లీడర్‍ సోమారపు రాజశేఖర్‍, నర్సంపేట మండలం గురిజాల గులాబీ పార్టీ అధ్యక్షుడు చెన్నపెల్లి నర్సింగం, మాజీ ప్రెసిడెంట్‍ దూడేల ప్రకాశ్‍, చెన్నారావుపేట మండలం లింగగిరి పార్టీ ప్రెసిడెంట్‍ మాదారాపు శ్రీనివాస్‍, మాజీ సొసైటీ అధ్యక్షుడు కడగండ్ల చిన్న యాకయ్య, రెడ్లవాడ సొసైటీ డైరెక్టర్‍ భర్త మట్టె బాబు, వార్డు మెంబర్‍ మట్టె వెంకన్న కుమారుడు మహేశ్‍కు యూనిట్లు ఇచ్చారు. దుగ్గొండి మండలం రేకంపల్లి మాజీ సర్పంచ్‍ మంద శ్రీనివాస్‍, సొసైటీ మాజీ డైరెక్టర్‍ మనోజ్‍ పేర్లను ఎమ్మెల్యే పెద్ది పేద దళితుల జాబితాలో చేర్చారు. నర్సంపేట టీఆర్‍ఎస్‍ కౌన్సిలర్లందరికీ ఎమ్మెల్యే ఒక్కో యూనిట్‍ కేటాయించారని, వారు చెప్పిన పేర్లను జాబితాలో ఓకే చేసినట్లు ఆరోపణలున్నాయి.

రోడ్డెక్కి ఆందోళనలు 
పేద దళితుల కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఎమ్మెల్యేలు టీఆర్‍ఎస్‍ పార్టీ పథకంగా మార్చడాన్ని నిరసిస్తూ అర్హులైన దళిత పేదలు నియోజకవర్గాల్లో రోడ్లమీదకొచ్చి ధర్నాలకు దిగుతున్నారు. స్టేషన్‍ ఘన్‍పూర్‍ తాటికొండ రాజయ్య తీరుపై  తీవ్ర విమర్శలు రావడంతో ఆయన వెనక్కు తగ్గారు. దళితబంధు జాబితా నుంచి తమ్ముడి పేరు తొలగిస్తున్నట్లు చెప్పారు.  సిటీ పరిధిలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ తీరుపై సోషల్‍ మీడియాలో రచ్చ నడిచింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి టీఆర్‍ఎస్‍ పార్టీ కేడర్‍కు స్కీం వర్తింపజే యడంపై ఖానాపూర్‍ మండలం బుధరావుపేట పేద దళితులు 365 నేషనల్‍ హైవేపై ధర్నా చేశారు. పరకాల నియోజకవర్గం ఆత్మకూర్‍లో ఎంఆర్‍పీఎస్‍, దళిత మహిళలు ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన అనుచరులకే ఇప్పించుకున్నా డని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి నియో జకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం కాట్రపల్లి దళితులు తమ గ్రామం నుంచి హన్మకొండలోని దయాకర్‍రావు ఇంటికి 60 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. హుస్నాబాద్‍ నియోజక వర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికలపేట దళితులు శుక్రవారం గ్రామ పంచాయతీ వద్దకు పోటెత్తారు. అర్హులను కాదని ఇతరుల పేర్లు ఎలా చేర్చారంటూ సర్పంచును నిలదీశారు. శనివారం సైతం హుజూరాబాద్‍, హన్మకొండ నేషనల్‍ హైవేపై ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే సతీశ్​ పెంచికలపేటను దత్తత తీసుకుని.. టీఆర్‍ఎస్‍ లీడర్లకు10 లక్షలు ఇప్పించారంటూ ఆందోళన చేపట్టారు.  

పెంచికలపేటలో దళితుల ధర్నా
ఎల్కతుర్తి, వెలుగు: టీఆర్ఎస్​లీడర్లకే దళితబంధు పథకం ఇస్తున్నారంటూ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేటకు చెందిన వంద దళిత కుటుంబాలు హనుమకొండ – -కరీంనగర్​ రహదారిపై శనివారం ధర్నా నిర్వహించాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని  ఎమ్మెల్యే, టీఆర్ఎస్​లీడర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  సర్పంచ్, ఎంపీటీసీ, ఉపసర్పంచ్ ప్రజా ప్రతినిధులు కలిసి తమకు అనుకూలంగా ఉన్న టీఆర్ఎస్​ లీడర్ల పేర్లను జాబితాలో చేర్చారని ఆరోపించారు. గంటపాటు ఆందోళన కొనసాగడంతో వెహికల్స్​ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్సై పరమేశ్వర్, సర్పంచ్​ అక్కడికి చేరుకొని ఎమ్మెల్యేతో ఫోన్​లో మాట్లాడించారు. అర్హులకు దళితబంధు అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.