32 గుంటలకు పట్టా చేసే వరకు.. ఈ రోడ్డు మీద తిరగనియ్యం

32 గుంటలకు పట్టా చేసే వరకు..  ఈ రోడ్డు మీద తిరగనియ్యం

సిద్దిపేట రూరల్, వెలుగు: గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ భూమికి పట్టాలు చేసి ఇవ్వాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి గ్రామ రైతులు సోమవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. మిట్టపల్లి నుంచి బొగ్గులోనిబండ గ్రామానికి వెళ్లే రోడ్డుకు అడ్డంగా ముళ్ల చెట్లు వేసి నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మిట్టపల్లి – బొగ్గులోనిబండకు తారు రోడ్డు వేసే టైంలో గ్రామానికి చెందిన 15  కుటుంబాలు 32 గుంటల పట్టా భూమిని కోల్పోయాయన్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమీపంలోని ప్రభుత్వ భూమిలో 32 గుంటలు కేటాయించి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని వాపోయారు. 

రైతుల సమస్య పరిష్కరించాలని స్థానిక మంత్రి హరీశ్​రావు రెవెన్యూ అధికారులను పలుమార్లు ఆదేశించినా చలనం లేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు రోడ్డును మూసివేస్తామని రైతులు తేల్చి చెప్పారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు రైతుల వద్దకు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రోడ్డుపై వేసిన ముళ్ల చెట్లను  తొలగించారు.