తమకు పెండింగ్ పెట్టిన వెయ్యి కోట్ల రూపాయల బిల్లులు వెంటనే ఇవ్వాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు బల్దియా హెడ్ ఆఫీస్ ఆవరణలోని కాంట్రాక్టర్స్ యూనియన్ ఆఫీసు ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. చేసిన పనులకు బిల్లులు అందక అప్పుల పాలవుతున్నామని, అప్పుల బాధ భరించలేక పలువురు కాంట్రాక్టర్లు గుండెపోటుతో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేసి బిల్లుల కోసం ఎదురుచూడాల్సి వస్తుందని, మేఘా కృష్ణారెడ్డి లాంటి బడా కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే ఇస్తున్న ప్రభుత్వం చిన్న చిన్న కాంట్రాక్టర్లమైన తమపై ఎందుకింత వివక్ష చూపుతోందని మండిపడ్డారు.
పది నెలల నుంచి బిల్లులు రావడం లేదని ఇలాగైతే కాంట్రాక్టర్లు ఎలా బతకాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా బిల్లులు ఇవ్వాలని లేకపోతే పనులు బంద్ చేసి ఆందోళన చేపడతామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు పనులు చేసి నెలలు గడుస్తున్నా.. బిల్లులు అందడం లేదని, ఎవరిని అడిగినా కనీసం ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదన్నారు. కొందరు కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి పనుల చేశారని, బిల్లులు రాకపోడంతో పనులకు దూరమయ్యారన్నారు. జీహెచ్ఎంసీలో 5 వేల మంది కాంట్రాక్టర్లు ఉన్నారని, వారిని నమ్ముకొని 2 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, బిల్లులు ఇవ్వకపోతే వారికి వేతనాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ALSO READ :ఉమ్మెడలో మరో శాసనం వెలుగులోకి..
వెంటనే బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి సురేందర్ సింగ్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్‌ను బిల్లులు అడిగితే స్పందించడంలేదని, మంత్రి కేటీఆర్ ను కలుద్దామంటే అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదన్నారు. లేబర్, మెటిరీయల్, ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని, రెండు, మూడు నెలలకోసారైనా బిల్లులు ఇస్తే కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకొస్తారన్నారు. కానీ 9, 10 నెలలు అవుతున్నా.. బిల్లులు ఇవ్వకపోతే పనులు ఎలా చేయాలని ప్రశ్నించారు.
వెంటనే బిల్లులు ఇవ్వాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ మాజీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, హన్మంత్ సాగర్, నిజాముద్దిన్, రమేశ్, ఆఫీఫ్, కళ్యాణ్ చక్రవర్తి, మధుసూదన్ పాల్గొన్నారు.