పచ్చని పల్లెల్ని నాశనం చేసిన్రు..ఆఫీసర్లపై గ్రామస్తుల ఆగ్రహం

పచ్చని పల్లెల్ని నాశనం చేసిన్రు..ఆఫీసర్లపై గ్రామస్తుల ఆగ్రహం

జైపూర్​/మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​లోని ఇందారం 1ఏ అండర్ గ్రౌండ్​ విస్తరణ కోసం మంగళవారం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభలో ప్రభావిత గ్రామాల ప్రజలు..  సింగరేణి యాజమాన్యం,ఆఫీసర్ల తీరుపై మండిపడ్డారు. అండర్​గ్రౌండ్ మైన్​విస్తరణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఇందారం ఓసీపీ ఏర్పాటు సందర్భంగా నిర్వాసితులు, ప్రభావిత గ్రామాల ప్రజలు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. మంగళవారం  ఇందారం 1ఏ గని వద్ద గని ఉత్పత్తి, జీవితకాలం పెంపునకు అవసరమైన పర్యావరణ పర్మిషన్​ కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి  రీజినల్​ఇంజినీర్​ భిక్షపతి అధ్యక్షతన జరిగిన సభలో మంచిర్యాల అడిషనల్​ కలెక్టర్​ మధుసూదన్​నాయక్​, శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి జీఎం ఎం.సురేశ్​​పాల్గొన్నారు. 

నాటి హామీలు ఏమైనయ్?

ప్రజాభిప్రాయసేకరణ జరిగినంతసేపు ప్రభావిత గ్రామాల ప్రజలు గతంలో ఇందారం ఓసీపీ సందర్భంగా సింగరేణి యాజమాన్యం ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదంటూ ఆఫీసర్లపై మండిపడ్డారు. యాజమాన్యం తమకు అనుకూలంగా ఉన్న సింగరేణి ఎంప్లాయీస్​, లీడర్ల అభిప్రాయాలను తీసుకుంటోందని, ఇది సరికాదని సభావేదిక వద్దకు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సింగరేణి కార్మికులు మాట్లాడినంతసేపు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందారం ఓసీపీ ఏర్పాటుతో  ఇందారం, టేకుమట్ల, రామారావుపేట, దొరగారిపల్లి గ్రామాలు విధ్వంసానికి గురయ్యాయని  గ్రామస్తులు  ఆరోపించారు. ఇందారం ఓసీపీనీ ప్రజలంతా  వ్యతిరేకించినా సింగరేణి బలవంతంగా ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటివరకు భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం,  స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించలేదన్నారు. టేకుమట్ల, ఇందారం, రామారావుపేట గ్రామాలను పూర్తిగా తీసుకొని నష్టపరిహారం అందించాలని డిమాండ్​ చేశారు. లారీలపై టార్పాలిన్​ ఏర్పాటు చేయకపోవడంతో దుమ్ము, ధూళితో గ్రామస్తులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని, బ్లాసింగ్​లతో ఇళ్లు బీటలు వారుతున్నాయని వాపోయారు.  ఓసీపీతో 1,200 మంది కూలీలకు పనులు లేకుండా పోయాయని, వారికి జీవో ప్రకారం పరిహారం ఇవ్వలేదన్నారు. 70శాతం ఉద్యోగాలు స్థానిక నిరుద్యోగులకు కల్పించాలని డిమాండ్​ చేశారు. 

పరిహారం ఎప్పుడిస్తరు?

ఇందారం ఓసీపీలో తన భూములు ముంపునకు గురయ్యాయని, రూ.50లక్షల పరిహారం కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నా సింగరేణి, రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోవడంలేదని రేగుంట లింగయ్య తన పాస్​బుక్​ను ప్రదర్శిస్తూ పేర్కొన్నాడు. రెండేళ్ల నుంచి నిరుద్యోగులు ఓసీపీలో ఉద్యోగాల కోసం తిరుగుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని బీజేపీ యూత్​ డిస్ర్టిక్ట్​ సెక్రటరీ, భూ నిర్వాసితుడు సుమన్​యాదవ్, ఫయోజోద్దిన్,  రాజలింగు, రాకేశ్ ​అన్నారు. ఉపాధి కల్పించే విషయంలో ఓసీపీ పీవో దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని  రేగుంట సునీల్​మాదిగ ఆరోపించారు. కాంట్రాక్ట్​ పనుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్​ వర్తింపజేయాలని డిమాండ్​ చేశారు. ఇందారం ఓసీపీతో భూమిని కోల్పోయినా ఒక రూపాయి నష్టపరిహారం రాలేదని, కూలీ పని కూడా దొరకడం లేదని, బతుకుదెరువు  కష్టమవుతోందని సింగరేణి యాజమాన్యం ఆదుకోవాలని సంకసార్ల రాజేశ్వరి, పుసాల నర్సవ్వ, మద్ది లక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు.  ఓసీపీ ఏర్పాటు సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే ప్రజలు  సింగరేణిని నమ్మడంలేదని ఐఎన్టీయూసీ,  బీఎంఎస్, ఏఐటీయూసీ లీడర్లు బి.జనక్​ప్రసాద్​, పేరం రమేశ్, ఎస్​.బాజీసైదా ఆరోపించారు. మైన్​ విస్తరణను స్వాగతిస్తున్నామన్నారు. టీఆర్ఎస్​ సర్కార్​ వచ్చిన తర్వాత కొత్త మైన్స్​ వచ్చాయని, ఓసీపీల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయని టీబీజీకేఎస్​ ప్రెసిడెంట్​వెంకట్రావు, జనరల్​సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి, శ్రీరాంపూర్​ వైస్​ ప్రెసిడెంట్ కె.సురేందర్​రెడ్డి తెలిపారు.