వీఆర్ఏల ఆందోళన.. అసంపూర్తిగా ముగిసిన చర్చలు

వీఆర్ఏల ఆందోళన.. అసంపూర్తిగా ముగిసిన చర్చలు
  • చలో అసెంబ్లీ ఉద్రిక్తం.. పోలీసుల లాఠీచార్జ్ 
  • ఆందోళనలతో అట్టుడికిన హైదరాబాద్ 
  • సమ్మె అర్థరహితమన్న సీఎం వ్యాఖ్యలపై ఫైర్​ 
  • రెండ్రోజుల ముందే రాజధానికి 
  • వేలాదిగా తరలివచ్చిన వీఆర్ఏలు
  • బారికేడ్లు దాటుకొని ట్యాంక్​బండ్​​కు 
  • అసెంబ్లీ వైపు వెళ్లకుండా అడ్డుకున్న 
  • పోలీసులు.. వందలాది మంది అరెస్ట్
  • మహిళా వీఆర్ఏలని కూడా 
  • చూడకుండా చావబాదిన పోలీసులు 
  • జేఏసీ నేతలను చర్చలకు పిలిచిన ‌‌కేటీఆర్
  • సమ్మె వాయిదా వేయాలని అభ్యర్థన 
  • సర్కారుపై నమ్మకం లేదన్న నేతలు.. జీవో 
  • ఇచ్చే వరకూ సమ్మె విరమించబోమని వెల్లడి

హైదరాబాద్ : వీఆర్ఏల ఆందోళనతో హైదరాబాద్ అట్టుడికింది. 50 రోజులుగా సమ్మె చేస్తున్నా సర్కార్ పట్టించుకోకపోవడంతో మంగళవారం వీఆర్ఏలు చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. జేఏసీ పిలుపు మేరకు పోలీస్​ నిఘా, నిర్బంధాన్ని దాటుకొని 33 జిల్లాల నుంచి వేలాది మంది వీఆర్ఏలు హైదరాబాద్​కు తరలివచ్చారు.  అప్పటి వరకు విడివిడిగా ఉన్న వీఆర్ఏలు నిమిషాల్లోనే పెద్ద గుంపుగా మారి మెరుపు వేగంతో బారికేడ్లు, ఇనుప కంచెలు దాటుకొని ట్యాంక్​ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు అంబేద్కర్​ విగ్రహం సెంటర్​కు ముందే వీఆర్ఏలను ఆపేందుకు విచక్షణారహితంగా లాఠీచార్జ్​ చేశారు. మహిళా వీఆర్ఏలని కూడా చూడకుండా చావబాదారు. దీంతో వందలాది మందికి గాయాలయ్యాయి. ఇంటెలిజెన్స్, పోలీసుల కళ్లుగప్పి తెలంగాణ ఉద్యమం నాటి మిలియన్ మార్చ్ ను తలపించేలా నిర్వహించిన ఆందోళనతో అధికార యంత్రాంగం కంగుతిన్నది. పోలీస్​ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 10 మంది వీఆర్ఏ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించడంతో ఆందోళనకారులు కాస్త శాంతించారు. మరో వైపు టీచర్లు, సింగరేణి కార్మికులు కూడా అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాటలు, లాఠీచార్జీతో సుమారు 5  గంటలపాటు అసెంబ్లీ, ట్యాంక్ బండ్, ఇందిరాపార్క్​పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.  

నినాదాలతో దద్దరిల్లిన ట్యాంక్ బండ్ ప్రాంతాలు
12, 13వ తేదీల్లో అసెంబ్లీ మీటింగ్​లు నిర్వహిస్తున్న నేపథ్యంలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం వీఆర్ఏ జేఏసీ 13న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. గ్రామాల్లో ఉంటే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే చాన్స్​ ఉండడంతో వ్యూహాత్మకంగా ఆది, సోమవారాల్లోనే సుమారు 10వేల మంది వీఆర్ఏలు హైదరాబాద్​కు చేరుకుని తమ బంధువులు, స్నేహితుల ఇండ్లు, లాడ్జీల్లో బస చేశారు. 50 రోజులుగా సమ్మె చేస్తున్నా సర్కార్ పట్టించుకోకపోవడం, తోటి ఉద్యోగుల మరణాలు, బలవన్మరణాలు  పెరుగుతుండడం, పైగా వీఆర్ఏల సమ్మె అర్థరహితమని అసెంబ్లీలో సోమవారం  కేసీఆర్ ప్రకటించడం వారికి మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో వాట్సాప్​ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పోలీస్ నిఘాకు చిక్కకుండా  మంగళవారం ఉదయం 11 గంటలకే వేలాది మంది వీఆర్ఏలు ఇందిరాపార్క్ పరిసరాలకు  చేరుకున్నారు. నిమిషాల్లోనే పెద్ద గుంపుగా ఒక్కచోట చేరి కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు సాగారు. పోలీసులు అడ్డుకుంటున్నా ఆగకుండా తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింది దాకా చేరుకున్నారు. వారిని నిలువరించడం కష్టంగా మారడంతో హుటాహుటిన రాపిడ్ ఫోర్స్​ను తరలించి అడ్డుకుని లాఠీచార్జీ చేశారు. 300 మందిని అరెస్ట్ చేసి వివిధ పీఎస్​లకు తరలించారు. దీంతో మిగతా వీఆర్ఏలు అక్కడే బైఠాయించి ‘‘సీఎం డౌన్​ డౌన్​.. పేస్కేల్ అమలు చేయాలి.. వారసత్వ ఉద్యోగాలివ్వాలి..’’ అంటూ నినాదాలు చేశారు. బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌, నాంపల్లి రూట్లలోనూ పోలీసులు ఆందోళనకారులు రాకుండా బారికేడ్లు పెట్టారు. సుందరయ్య విజ్జాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్‌‌‌‌, అసెంబ్లీ వైపు వస్తున్న టీచర్లు, వీఆర్‌‌‌‌‌‌‌‌ఏలను పోలీసులు అడ్డుకున్నారు.  

అసంపూర్తిగా ముగిసిన చర్చలు.. 
వీఆర్‌‌‌‌ఏల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న మంత్రి కేటీఆర్.. వారిని చర్చలకు ఆహ్వానించారు. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో వారికి పిలుపు రాగా.. వారిని పోలీసులు అసెంబ్లీ లాబీల్లోకి తీసుకెళ్లారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో వీఆర్ఏ సంఘాల జేఏసీ ప్రతినిధులు దాదేమియా, వంగూరు రాములు, వెంకటేశ్ యాదవ్, నారాయణ, వెంకటేశ్, రాజప్ప తదితరులతో కేటీఆర్ అరగంటకు పైగా చర్చించారు. సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చిన పే స్కేల్ అమలు చేయాలని, వారసులకు ఉద్యోగాలు, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలనే 15 డిమాండ్లను వీఆర్ఏ సంఘాల జేఏసీ ప్రతినిధులు కేటీఆర్ ముందుంచారు. వీఆర్ఏల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబురాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విధులకు హాజరు కావాలని, సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని వీఆర్ఏలను కేటీఆర్ కోరారు. జీవో ఇచ్చి పరిష్కారమయ్యే వరకు వీఆర్ఏల వెంటే ఉంటానని హామీ ఇచ్చారు. ఈ డిమాండ్లపై ఈ నెల 18 తర్వాత  సీఎస్ నేతృత్వంలో చర్చలు జరిపిస్తానని, అప్పటి వరకు ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఏడేండ్ల క్రితం ఇలాగే ప్రగతి భవన్​ లో, రెండేండ్ల క్రితం అసెంబ్లీలో ఇలాగే సీఎం హామీలు ఇచ్చారని కానీ నెరవేర్చలేదని.. జీవో ఇచ్చే వరకూ సమ్మె విరమించబోమని జేఏసీ నేతలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీంతో ఈ నెల 20న మరోసారి చర్చిద్దామని మంత్రి కేటీఆర్ అనడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. 

20 వరకు సమ్మెలోనే..
చర్చల అనంతరం బయటికొచ్చిన వీఆర్ఏ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ దాదేమియా, కోచైర్మన్ రమేశ్ బహదూర్, జేఏసీ కోకన్వీనర్ కంది శిరీషారెడ్డి అసెంబ్లీ పార్కింగ్ దగ్గర మీడియాతో మాట్లాడారు. తమ న్యాయమైన హక్కుల కోసం 50 రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్నామని తెలిపారు. ఎట్టకేలకు తమ ప్రధాన డిమాండ్లయిన పే స్కేల్, 50 ఏండ్లపై బడిన వీఆర్‌‌‌‌ఏల వారసులకు ఉద్యోగాలు,  అర్హులైన వీఆర్‌‌‌‌ఏలకు ప్రమోషన్లపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.  ఈ విషయమై ఈ నెల 20న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే సమ్మె యథావిధిగా శాంతియుతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్‌‌‌‌ కోరారని.. అయితే ఈ నెల 20 వరకు తాము శాంతియుతంగా సమ్మెను  కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. 

సీఎం అట్ల అనాల్సింది కాదు: కేటీఆర్ 
వీఆర్ఏల ఆందోళన పనికిమాలినది అని సీఎం కేసీఆర్ అనాల్సింది కాదని మంత్రి కేటీఆర్‌‌ అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో వీఆర్ఏ సంఘాల జేఏసీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. వీఆర్ఏల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఈ నెల 18 వరకు ఓపిక పట్టాలని, సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరారు. అయితే జీవో ఇచ్చే వరకూ సమ్మె విరమించబోమని జేఏసీ ప్రతినిధులు చెప్పారు. దీంతో ఈ నెల 20న మరోసారి చర్చిద్దామని మంత్రి కేటీఆర్ అనడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.