పంచిన ‘డబుల్’​ ఇండ్లకు తాళాలు

పంచిన ‘డబుల్’​ ఇండ్లకు తాళాలు
  • రాంతీర్థంలో  పేదల నిరసన
  • ఉన్నోళ్లకు, లీడర్ల చుట్టాలకే ఇచ్చారని ఆరోపణ
  • కిటికీల అద్దాలు ధ్వంసం.. పోలీస్ స్టేషన్ కు మహిళల తరలింపు

మెదక్, వెలుగు:  మెదక్​ జిల్లా పాపన్నపేట  మండలం  రాంతీర్థంలో  డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ఆందోళనకు దారి తీసింది.  ఇండ్ల  కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అర్హులమైన తమకు ఇండ్లు ఇవ్వలేదని ఆగ్రహంతో  కొన్ని ఇండ్లకు తాళాలు వేశారు. పలు ఇండ్ల కిటికీల అద్దాలు పగులగొట్టారు.  వివరాలిలా ఉన్నాయి..  డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీంలో మూడేండ్ల కింద రాంతీర్థం గ్రామానికి 56 ఇండ్లు శాంక్షన్​ అయ్యాయి. పంచాయతీరాజ్ డిపార్ట్​మెంట్​ఆధ్వర్యంలో  గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఆగుతూ.. సాగుతూ ఏడాది కింద పనులు పూర్తయ్యాయి. లబ్ధిదారుల సెలక్షన్​ లిస్టు పూర్తికాకపోవడంతో ఎవరికీ ఇండ్లను అలాట్ చేయలేదు.   మొన్నటి సోమవారం మంత్రి హరీశ్ రావ్, మెదక్  ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా రాంతీర్థంలో  నిర్మించిన డబుల్  బెడ్రూం ఇండ్లను కేటాయించి, లబ్ధిదారులకు పట్టాలు అందించారు.

ఇండ్ల కేటాయింపు జరిగిన మరుసటి రోజే గ్రామానికి చెందిన కొందరు పేదలు కలెక్టరేట్ కు  వచ్చి నిరసన వ్యక్తం చేశారు. సొంత ఇండ్లు  లేని వారికి ఇవ్వకుండా ఉన్నోళ్లకే  ఇచ్చారని,  వాటిని క్యాన్సిల్​ చేసి అర్హులకు ఇండ్లు ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ లో వినతి పత్రం అందించారు.  అలాగే బుధవారం కొందరు గ్రామస్తులు ఆందోళనకు దిగి అధికార పార్టీ లీడర్ల సంబంధికుల పేరు మీద అలాట్ చేసిన ఇండ్లకు  తాళాలు వేశారు.  పలు ఇండ్ల కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ ఎస్ లీడర్లు డబ్బులు తీసుకొని  అనర్హులకు ఇండ్లను పంపిణీ చేయించారని ఆరోపించారు.  ఆందోళన విషయం తెలుసుకున్న పాపన్నపేట పోలీసులు గ్రామానికి  చేరుకొని ఇండ్లకు తాళాలు వేసి,  కిటికీల అద్దాలు పగులగొట్టారని పలువురు మహిళలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.