
వరద సాయం కోసం హైదరాబాద్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్థిక సాయాన్ని అసలైన బాధితులకు ఇవ్వడం లేదంటూ వందలాది మంది ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన బాధితులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వరద సాయం పంపిణీలో వివక్ష చూపిస్తున్నారని, టీఆర్ఎస్ కార్యకర్తలకే పరిహారం ఇస్తున్నారని ఆరోపించారు బాధితులు. తమకు సాయం అందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు.
వరద బాధితులకు సర్కార్ సాయం ఆగిపోయిందని.. అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు వరద బాధితులు. సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు వరద సాయం అందటం లేదంటూ ఎమ్మెల్యే ఇంటి ముందు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడో వ్యక్తి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు… కాలనీ వాసులు.. వ్యక్తిని అడ్డుకున్నారు.
నాంపల్లిలోని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారు ముంపు బాధితులు. మల్లెపల్లి, నాంపల్లి, ఆగాపుర కాలనీ వాసులు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటి వరకు తమకు… సర్కార్ నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామంటున్నారు.
కర్మాన్ ఘాట్ లో నిరసనకు దిగారు వరద బాధితులు. రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వరదలతో సర్వం కోల్పోతే… కనీసం పట్టించుకోలేదంటున్నారు . రోడ్డుపై ధర్నాకు దిగటంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మైలార్ దేవ్ పల్లి లోని సులేమాన్ నగర్ లో వరద బాధితులు ఆందోళనకు దిగారు. వరద సాయం అందలేదని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఇంటి ముందు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. వరద సాయం పక్కదారి పడుతోందని, దొంగచాటుగా అధికారులు డబ్బులు పంచుకున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగేంత వరకు కదలమని ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.