పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందే

పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందే

ముల్కలపల్లి, వెలుగు: రాష్ట్రంలో పోడు భూముల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. పోడు భూముల్లో మొక్కలు నాటాలని ప్రయత్నిస్తున్న ఫారెస్ట్​ఆఫీసర్లను రైతులు అడ్డుకుంటున్నారు. పోడుభూములకు పట్టాలు ఇవ్వాలంటూ కలెక్టరేట్ల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, పంచాయతీలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామస్థులు సోమవారం చేపట్టిన చలో ప్రగతిభవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టీఆర్ఎస్​సర్పంచ్​మడకం స్వరూప ఆధ్వర్యంలో వార్డుమెంబర్లు, ప్రజలు పాదయాత్రగా బయలుదేరగా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్​స్టేషన్లకు తరలించారు. సోమవారం తెల్లవారుజామున సర్పంచ్​సర్వూపతో పాటు వార్డుమెంబర్లు, ప్రజలు దాదాపు వంద మంది నిత్యావసర వస్తువులు తీసుకుని హైదరాబాద్​కు బయల్దేరారు. అశ్వారావుపేట ఊరి చివర వరకు పాదయాత్రగా వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చలో ప్రగతిభవన్​కు పర్మిషన్​ లేదంటూ వారిని అడ్డుకున్నారు. అధికార పార్టీకి చెందినవాళ్లం, సీఎం వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకొనే అవకాశం కూడా మాకు లేదా అంటూ సర్పంచుతోపాటు ప్రజలు పోలీసులను నిలదీశారు. దీంతో పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకుని డీసీఎంలో ఎక్కించారు. కొందరిని పాల్వంచ మండలంలోని కిన్నెరసాని పోలీస్​స్టేషన్​కు, మరికొందరిని ముల్కలపల్లి పోలీస్​స్టేషన్​కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ముల్కలపల్లి పోలీస్​స్టేషన్​కు చేరుకున్నారు. ఎందుకు అరెస్టు  చేస్తున్నారంటూ ప్రజలతో కలిసి పోలీస్​స్టేషన్​ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దాదాపు నాలుగు గంటల పాటు ధర్నా చేశారు. పంచాయతీలో నెలకొన్న సమస్యలతో పాటు పోడుభూముల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అడిషనల్​కలెక్టర్​వెంకటేశ్వర్లు హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. సమస్యలను పరిష్కరించకపోతే తమ పంచాయతీలో ఎమ్మెల్యే నాగేశ్వరరావుతో పాటు ఎంపీపీ శ్రీరాంమూర్తిని తిరగనివ్వబోమని సర్పంచుతోపాటు ప్రజలు హెచ్చరించారు. 

అర్హులకు పట్టాలియ్యాలె

అర్హులైన పోడు సాగుదారులకు పట్టాలివ్వాలంటూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని కలెక్టరేట్​ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుగులోత్​ధర్మా మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలిస్తామని దరఖాస్తులు తీసుకుని ఎనిమిది నెలలు గడుస్తున్నా అతీగతీ లేదన్నారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్​అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్​ చేశారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. 

మా భూముల్లో మొక్కలు నాటనియ్యం

గండీడ్: ప్రభుత్వం ఇచ్చిన భూమిని 70 ఏండ్లుగా సాగు చేసుకుని బతుకుతుంటే ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ ల్యాండ్స్​అని ఎలా అంటారంటూ ఆఫీసర్లను రైతులు నిలదీశారు. మహబూబ్​నగర్​ జిల్లా నంచర్ల గ్రామ శివారులోని 663 సర్వే నంబర్ లో మొక్కలు నాటేందుకు సోమవారం ఫారెస్ట్​ఆఫీసర్లు వెళ్లారు. విషయం తెలిసి రైతులు ఆఫీసర్లను అడ్డుకున్నారు. తరాలుగా ఆ భూములు సాగు చేసుకుని బతుకుతున్నామని, తాతలు, తండ్రుల సమాధులు కూడా అక్కడే ఉన్నాయని రైతులు చెప్పారు. ఇప్పుడు ఆ భూముల్లో పంటలు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. తహసీల్దార్​ ఆంజనేయులు అక్కడికి  చేరుకుని ఫారెస్ట్​ ఆఫీసర్లు, రైతులతో మాట్లాడారు. జిల్లా అధికారులను సంప్రదించి సర్వే చేయిస్తామని, అప్పటివరకు గొడవపడొద్దని సూచించారు. 

కొత్తయి నరకం.. పాతయి ఇడ్వం

మరో భూపోరాటానికి సిద్ధమన్న కుమ్రంభీం పురిటి గడ్డ రౌటసంకేపల్లి రైతులు

ఆసిఫాబాద్: తాము కొత్తగా చెట్లు నరికి పోడు చేయడం లేదని, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న భూముల్లో పంటలు వేసుకుంటే ఫారోస్టోళ్లకు వచ్చిన నష్టం ఏమిటని గిరిజన రైతులు ప్రశ్నించారు. రౌట సంకేపల్లి పంచాయతీ పరిధిలోని అడ్డఘాట్, మేంగుబాయి, బొందగూడ గ్రామాల్లోని రైతులు 300  ఎకరాల్లో పోడు భూములను 30 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. వీరందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నాయి. ఆదివారం రైతులు భూములు దున్నారు. విషయం తెలిసి ఫారెస్ట్​ ఆఫీసర్లు సోమవారం పోడు భూముల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. రైతులు రౌట సంకేపల్లి గ్రామంలో ఫారెస్ట్​ ఆఫీసర్ల వెహికల్స్​కు ఎడ్ల బండ్లు అడ్డుపెట్టి ఆందోళన చేశారు. 1976 నుంచి తమకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్నందున ఆ భూములను వదులుకునే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే కుమ్రంభీం పురిటి గడ్డ రౌట సంకేపల్లి నుంచి మరో భూపోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. చేసేదేం లేక ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బంది వెనుదిరిగారు.

పట్టాలు ఇచ్చేవరకు పోరాటం ఆగదు: తమ్మినేని 

మంచిర్యాల: రాష్ట్రంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు ఇచ్చేదాకా తమ పోరాటం ఆగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల కలెక్టరేట్​ను ముట్టడించారు. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ.. 2005 సంవత్సరం కంటే ముందు సాగులో ఉన్నవాళ్లకు పట్టాలు ఇవ్వాలని 2006లో పార్లమెంట్​ అటవీ హక్కుల చట్టం చేసిందన్నారు. కానీ ఈ చట్టాన్ని ధిక్కరిస్తూ ఆదివాసీలు, గిరిజనులు, పేదలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో ఫారెస్ట్​ రైట్స్​కమిటీ(ఎఫ్ఆర్సీ)లు గుర్తించిన భూములకు పట్టాలు ఇవ్వాని డిమాండ్​ చేశారు.