హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని అభివర్ణించారు. బడ్జెట్ అంకెల గారడీ.. మాటల గారడీ.. బడ్జెట్ అంతా డొల్ల అని విమర్శించారు. బడ్జెట్లో ప్రభుత్వం అన్ని ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు లేవని అలాగే మెనార్టీలకు బడ్జెట్లో మొండిచేయి చూపారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రూ.3.5 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. మరీ తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మేము అప్పులు కాళేశ్వరం కట్టామన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు స్కాంలు తప్ప స్కీములు తెలియవని విమర్శించారు. ఈ బడ్జెట్లో సకల జనులకు దక్కింది సున్నా.
బడ్జెట్ అంతా డొల్ల అని విమర్శించారు. ఆరు హామీల అమలుపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గత బడ్జెట్లో నిధులు కేటాయించిన ఖర్చే చేయలేదని.. తిరిగి ఈ బడ్జెట్లోనూ అదే పాట పాడారని మండిపడ్డారు. బడ్జెట్ ప్రజలను తీవ్ర నిరాశ పర్చిందన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని తెలంగాణ, హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేశారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పడంతో రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గుతోందని చురకలంటించారు. ఈ ప్రభుత్వానికి కూల్చడం మీద ఉన్న ప్రేమ కట్టడాలపై లేదని ఎద్దేవా చేశారు. అక్రమ సంపాదనను విదేశాల్లో దాచుకోవడానికి తప్ప పెట్టుబడుల కోసం కాదని ఆరోపించారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు మూడుసార్లు ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.
