ఇంటర్నల్​ పోస్టుల భర్తీలో కొర్రీలు

ఇంటర్నల్​ పోస్టుల భర్తీలో కొర్రీలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లో నిబంధనలపై ఇంటర్నల్​అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 50 శాతం మార్కులు అర్హత కాగా ప్రస్తుతం 60 శాతం మార్కులు వచ్చిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలనడం, ఒక్కో పోస్టుకు ఒక్కో రకంగా అర్హతలు నిర్ణయించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిలో 813 పోస్టులు ఇంటర్నల్​, 272 పోస్టులు ఎక్స్​టర్నల్​ అభ్యర్థులతో భర్తీ చేసేందుకు యాజమాన్యం ఇటీవల నోటిఫికేషన్​జారీ చేసింది. ఐదేండ్ల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్​జారీ కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు కొర్రీలు పెట్టడంతో నిరాశకు గురవుతున్నారు. 

139 మైనింగ్​ మేనేజిమెంట్​ ట్రైనీ, 100 జూనియర్​ మైనింగ్​ ఇంజనీర్​పోస్టుల భర్తీ చేసేందుకు మైనింగ్​ గ్రాడ్యుయేషన్ చేసిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ పోస్టుకు డిగ్రీలో 60శాతం మార్కులు తప్పనిసరి అన్న నిబంధన విధించారు. గతంలో ఉన్న 50 శాతం మార్కుల నిబంధనలను మార్చడంపై అభ్యర్థులు మండిపడ్తున్నారు. మేనేజ్ మెంట్ ట్రైనీ(పర్సనల్​) పోస్టుల భర్తీకి కూడా ఏంబీఏ (హెచ్​ఆర్)​లో 60శాతం నిబంధన విధించారు. 

ఫారెస్ట్​ ఆఫీసర్​ పోస్టులకు మార్కుల నిబంధన లేదని, కొన్ని పోస్టులకే నిబంధనలు ఎందుకు మార్చారని ప్రశ్నిస్తున్నారు. 360 జూనియర్​అసిస్టెంట్​ పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటర్నల్ అభ్యర్థులకు డిగ్రీతో పాటు కంప్యూటర్​అప్లికేషన్స్​లో డిప్లోమా ఉండాలని నిబంధన విధించింది. ఈ అర్హతలన్నీ ఉన్నా సరే .. సర్వే మజ్దూర్లకు అప్లై చేసుకునే అవకాశం ఇవ్వలేదు. ఇంటర్నల్​ పోస్టుల భర్తీలో దివ్యాంగులకు రిజర్వేషన్లు వర్తింప చేయకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి.