షరతులు ఉంటేనే గిఫ్ట్‌‌‌‌ డీడ్ రద్దు...షరతులు లేకపోతే రద్దు చేయడానికి వీల్లేదు: హైకోర్టు

షరతులు ఉంటేనే గిఫ్ట్‌‌‌‌ డీడ్ రద్దు...షరతులు లేకపోతే రద్దు చేయడానికి వీల్లేదు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ప్రేమతో ఎలాంటి షరతులు లేకుండా పెద్దలు తమ పిల్లలకు గిఫ్ట్‌‌‌‌ డీడ్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌ చేస్తే.. దానిని సీనియర్‌‌‌‌ సిటిజన్స్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ కింద రద్దు చేయడం చెల్లదని హైకోర్టు తీర్పు వెలువరించింది. సీనియర్‌‌‌‌ సిటిజన్స్‌‌‌‌ చట్టంలోని సెక్షన్‌‌‌‌ 23(1) కింద ఒప్పందంలోని షరతులను ఉల్లంఘించినప్పుడే గిఫ్ట్‌‌‌‌ డీడ్‌‌‌‌ రద్దు చేయొచ్చని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌‌‌‌లోని ఓ బిల్డింగ్‌‌‌‌లో 5, 6 అంతస్తులను 2019లో ఇచ్చిన గిఫ్ట్‌‌‌‌ డీడ్‌‌‌‌ను అమ్మ, నాన్న, తాత ఫిర్యాదు ఆధారంగా ఆర్డీవో రద్దు చేశారు. 

ఈ నిర్ణయాన్ని అమెరికాలో ఉండే రోహిత్‌‌‌‌ శౌర్య అనే వ్యక్తి హైకోర్టులో సవాల్‌‌‌‌ చేశారు. ఆ బిల్డింగ్‌‌‌‌లోని 3, 4 అంతస్తులను పిటిషనర్‌‌‌‌కు, 5, 6 అంతస్తులను పిటిషనర్‌‌‌‌ సోదరుడికి వాళ్ల తాత సుబ్బారావు గిఫ్ట్‌‌‌‌ డీడ్‌‌‌‌ చేశారని అడ్వకేట్‌‌‌‌ వాదించారు. తాత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీనియర్‌‌‌‌ సిటిజన్స్‌‌‌‌ చట్టం కింద గిఫ్ట్‌‌‌‌ డీడ్‌‌‌‌ను ఆర్డీవో రద్దు చేయడం చెల్లదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. ‘‘సీనియర్‌‌‌‌ సిటిజన్స్‌‌‌‌ చట్టంలోని సెక్షన్‌‌‌‌ 23(1) కింద గిఫ్ట్‌‌‌‌ డీడ్‌‌‌‌ను రద్దు చేయాలనుకుంటే అందులో షరతులను ఉల్లంఘించి ఉండాలి.

 ప్రస్తుత కేసులో తాత కూతురు కొడుకులైన ఇద్దరు మనుమలకు ఫ్లాట్స్‌‌‌‌ను గిఫ్ట్‌‌‌‌ డీడ్‌‌‌‌ కింద రిజిస్టర్‌‌‌‌ చేశారు. వ్యక్తిగత అవసరాలను చూడాలని గిఫ్ట్‌‌‌‌ డీడ్‌‌‌‌లో ఎలాంటి షరతులు లేవు. అల్లుడితో విభేదాల కారణంగా సీనియర్‌‌‌‌ సిటిజన్స్‌‌‌‌ చట్టం కింద ఆర్డీవో వద్ద ఫిర్యాదు చేశారు. షరతుల్లేని గిఫ్ట్‌‌‌‌ను సీనియర్‌‌‌‌ సిటిజన్స్‌‌‌‌ చట్టం కింద రద్దు చేసే అధికారం ఆర్డీవోకు లేదు’’అని తీర్పు చెప్పింది.