యాదాద్రి, వెలుగు: రైతుల మీద ప్రేమ ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో రైతు భరోసా యాత్ర చేయాలని యాదాద్రి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి హితవు పలికారు. ఢిల్లీలో ప్రభుత్వంపై కొట్లాడి వడ్ల కొనుగోలుపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. మంగళవారం భువనగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిర్వాకం కారణంగానే తెలంగాణలో వడ్ల కొనుగోలులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.
గడిచిన రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్, ఎఫ్‌సీఐ తీసుకోక పోవడం వల్ల మిల్లుల్లో స్పేస్ ప్రాబ్లం ఏర్పడిందన్నారు. అందులో మిల్లుల్లో లారీల అన్లోడ్ ఆలస్యమవుతోందని తెలిపారు. అయినప్పటికీ మిల్లర్లతో చర్చలు జరుపుతూ కొనుగోలు చేసిన వడ్లను పంపిస్తున్నామని చెప్పారు. ఇక్కడ వడ్లను కొనుగోలు కాకుండా చేసిన బీజేపీ రైతులతో రాజకీయం చేస్తూ వారిని అయోమయానికి గురి చేస్తోందని ఆరోపించారు. అంతకుముందు తెలంగాణ గానకోకిల బెల్లి లలిత విగ్రహం ఏర్పాటు కోసం గుర్తించిన స్థలంలో పునాదిరాయి వేశారు.
