జడ్పీ చైర్మన్‌‌‌‌పై వేటు తప్పదా ?

జడ్పీ చైర్మన్‌‌‌‌పై వేటు తప్పదా ?
  • బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధం

వనపర్తి, వెలుగు: వనపర్తి జడ్పీ చైర్మన్‌‌‌‌పై వేటు వేసేందుకు బీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌‌‌‌ నాథ్‌‌‌‌ రెడ్డికి కొన్నాళ్లుగా మంత్రి నిరంజన్‌‌‌‌ రెడ్డితో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో బహిరంగంగానే మంత్రిపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన జడ్పీ మీటింగ్‌‌‌‌లో గంట పాటు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన మంత్రి జడ్పీ చైర్మన్‌‌‌‌ను పార్టీ నుంచి బహిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే  మూడు రోజుల కింద పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్..  టీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ముఖ్య నాయకులు అత్యవసర మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి హైకమాండ్‌‌‌‌కు పంపించారు. లోక్‌‌‌‌ నాథ్‌‌‌‌ రెడ్డి మరో పార్టీతో సంబంధాలు కొనసాగిస్తూ బీఆర్ఎస్‌‌‌‌కు వెన్నుపోటుదారుడిగా మారారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీనియర్లను కాదని అవకాశం..

మంత్రి నిరంజన్ రెడ్డి గత జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ సీనియర్లను కాదని లోక్ నాథ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ముందు నుంచే జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం చేసి వనపర్తి మండలం నుంచి టికెట్ ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని పార్టీలోని సీనియర్లు వ్యతిరేకించినా.. మంత్రి జోక్యంతో వివాదం సద్దుమణింది. లోక్‌‌‌‌నాథ్ రెడ్డి కొన్నాళ్లు బాగానే ఉన్నా పబ్లిక్, పార్టీ సమావేశాల్లో మంత్రితో సమానంగా తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించడం ప్రారంభించారు.  ఈ విషయంలో అధికారులతో చాలాసార్లు గొడవ పడ్డారు. తాజాగా వనపర్తి జడ్పీ మీటింగ్‌‌‌‌లో మంత్రి టార్గెట్‌‌‌‌గా కామెంట్లు చేశారు. తనను పదవి నుంచి తొలగించినా సామాన్య పౌరుడిగా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతానంటూ హెచ్చరించారు. దాదాపు గంట పాటు ఇద్దరి మధ్య వాదోపవాదనలు జరిగాయి. జడ్పీ నిధుల వినియోగం, అధికారులకు ఆదేశాలు ఇవ్వడంలో ప్రాధాన్యత లేనప్పుడు ఈ వ్యవస్థ ఎందుకంటూ ప్రశ్నించారు. మరో సభలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారైనా మంచి ఎమ్మెల్యేను ఎన్నుకోవాలంటూ కామెంట్ చేశారు. అంతేకాదు వనపర్తి కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రిపై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. ఇక లాభం లేదనుకున్న నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు లోక్ నాథ్ రెడ్డి పై హైకమాండ్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు.

అవిశ్వాస తీర్మానం పెడతారా.. ?

పార్టీలో ఉండి మరో పార్టీలో చేరేకంటే ముందే లోక్ నాథ్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేసి బయటికి పంపాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది. జడ్పీ పాలక మండలికి మరి కొద్ది నెలల్లోనే నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది. ఈలోగా ఆయనపై అవిశ్వాస తీర్మానం  ప్రవేశ పెట్టి తప్పించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  ఆలస్యం చేస్తే పార్టీ కి మరింత నష్టమని భావిస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి సైతం జిల్లా పార్టీ పంపిన తీర్మానాన్ని అమలు చేయాలని హైకమాండ్‌‌‌‌పై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

బీజేపీలోకి.. !

తాను పేరుకే చైర్మన్‌‌‌‌ అని, రిమోట్ కంట్రోల్ మంత్రి చేతుల్లో ఉందని  బహిరంగంగానే విమర్శలు చేస్తున్న లోక్‌‌‌‌నాథ్ రెడ్డి.. ఇటీవల  ఓ సభలో బీజేపీలోకి చేరనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.  తనకు పీఎం మోడీతో నేరుగా మాట్లాడే స్నేహితులు ఉన్నారని, తాను కోరుకుంటే ఆ పార్టీ టికెట్ వస్తుందంటూ కామెంట్‌‌‌‌ చేశారు. మరో వైపు కాంగ్రెస్‌‌‌‌కు కూడా టచ్‌‌‌‌లోనే ఉన్నారు. లోక్ నాథ్ రెడ్డి గతంలో కాంగ్రెస్‌‌‌‌ తరఫున మున్సిపల్ కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌గా ఎన్నికై వైస్ చైర్మన్‌‌‌‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో చిన్నారెడ్డికి అత్యంత ఆప్తుడిగా వ్యవహరించారు. బీఆర్ఎస్ లో మంత్రికి లోక్ నాథ్ రెడ్డికి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరును గుర్తించిన చిన్నారెడ్డి సొంత గూటికి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం.బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ తీసుకునే చర్యల ఆధారంగా త్వరలోనే నిర్ణయం ప్రకటించనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.