నడిగడ్డలో హీటెక్కిన రాజకీయాలు!.. ప్రధాన పార్టీ లీడర్ల పక్కచూపులు

నడిగడ్డలో హీటెక్కిన రాజకీయాలు!.. ప్రధాన పార్టీ లీడర్ల పక్కచూపులు
  • అయోమయానికి గురి చేస్తున్న గద్వాల ఎమ్మెల్యే తీరు
  • అలంపూర్ కు చెందిన ముఖ్య నాయకుడితో గద్వాల కాంగ్రెస్​ నేతల మంతనాలు
  • 13న కేటీఆర్  పర్యటన, నియోజకవర్గ ఇన్​చార్జి నియామకంపై క్లారిటీ వచ్చే అవకాశం

గద్వాల, వెలుగు: లోకల్ బాడీ ఎన్నికలకు ముందే నడిగడ్డ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలకు ముందే అధికార పార్టీ నుంచి విపక్షంలోకి, అక్కడి నేతలు అధికార పార్టీలోకి మారేందుకు సిద్ధమవుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వ్యవహారం  గందరగోళంగా ఉండడంతో కింది స్థాయి క్యాడర్  అయోమయానికి గురవుతోంది. కాంగ్రెస్​ టికెట్ ఆశిస్తున్న వారు, ఎలాగైనా లోకల్​ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న వారు బీ ఫామ్​ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. 

రిజర్వేషన్లు కలిసి రాకపోతే తమ అనుచరులకు టికెట్​ ఇప్పించుకోవడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పోటీ తక్కువగా ఉన్న పార్టీలో చేరి, తమ పలుకుబడితో గెలిచేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఇప్పటికే గద్వాల మాజీ మున్సిపల్  చైర్మన్  బీఎస్  కేశవ్ తో పాటు ఆరుగురు మాజీ కౌన్సిలర్లు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 13న బీఆర్ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  పర్యటనతో నడిగడ్డ రాజకీయాలు మరింత వేడెక్కే పరిస్థితి ఉందని అంటున్నారు.

బీ ఫామ్​ రాదనే ఉద్దేశంతో..

గద్వాల కాంగ్రెస్ లో పరిస్థితి గందరగోళంగా మారింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్  నుంచి సరిత పోటీ చేయగా, బీఆర్ఎస్  నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరినప్పటికీ, తాను టెక్నికల్ గా బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పడం గందరగోళానికి గురి చేస్తోంది. బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ ఎమ్మెల్యే కాంగ్రెస్  లీడర్లు, మంత్రులతో సఖ్యతగా ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్ లో ఎమ్మెల్యే పై చేయి సాధించారు. 

ఈక్రమంలో మాజీ జడ్పీ చైర్​పర్సన్​ సరిత వర్గానికి కాంగ్రెస్ లో ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. గద్వాల ఏఎంసీ చైర్మన్, జములమ్మ ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు, ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే వర్గానికే ఇచ్చారు. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో సరిత వర్గానికి టికెట్లు రావనే అనుమానం ఉంది. ఈ ఉద్దేశంతో పక్కచూపులు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

బీ ఫామ్​ ఎవరు ఇస్తరు?

గద్వాల జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్  పార్టీల నుంచి లోకల్ బాడీ ఎన్నికల బీఫామ్​లు ఎవరు ఇస్తారనే చర్చ జరుగుతోంది. గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరినప్పటికీ బీఆర్ఎస్  ఇన్​చార్జిగా ఎవరినీ నియమించలేదు. కాంగ్రెస్​లోనూ పరిస్థితి అలాగే ఉండడంతో బీఫామ్ లు ఎవరు ఇస్తారని రెండు పార్టీల లీడర్లు చర్చించుకుంటున్నారు. ఈ నెల 13న బీఆర్ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  గద్వాలలో పర్యటించనుండగా, బీఆర్ఎస్   ఇన్​చార్జిపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.

ఎత్తుకు పై ఎత్తులు..

లోకల్ బాడీ ఎన్నికలే లక్ష్యంగా అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. జడ్పీ చైర్మన్  పదవి దక్కించుకునేందుకు ఇటీవల అలంపూర్ కు చెందిన బీఆర్ఎస్  ముఖ్య నాయకుడితో కాంగ్రెస్ లోని ఒక వర్గం మంతనాలు చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఒక్కో జడ్పీటీసీ స్థానానికి ఎంత ఖర్ఛు అయినా తాము భరిస్తామని, చైర్మన్ గా అవకాశం కల్పించాలని ఆఫర్  ఇచ్చినట్లు సమాచారం. జడ్పీ చైర్మన్  పదవి జనరల్  అయితే ధరూర్  మండలానికి చెందిన లీడర్ కు, బీసీకి రిజర్వ్​ అయితే గద్వాల పట్టణానికి చెందిన లీడర్ కు ఇచ్చేలా ప్రతిపాదన ముందు ఉంచినట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు బీఆర్ఎస్​ ముఖ్య నేతను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మాజీ జడ్పీ చైర్​పర్సన్​ సరిత వర్గంలోని మెజార్టీ నాయకులు బీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు.