గజ్వేల్ ​బీఆర్ఎస్​లో గందరగోళం

గజ్వేల్ ​బీఆర్ఎస్​లో గందరగోళం
  •     టికెట్ రాకపోవడంపై వంటేరు ఆగ్రహం
  •     పార్టీ మారుతారనే ప్రచారం 
  •     ఒక్కసారిగా బయటపడ్డ వర్గపోరు
  •     కాంగ్రెస్​లోకి రానివ్వమంటూ స్థానిక నేతల ఆందోళన

సిద్దిపేట, వెలుగు : మెదక్ బీఆర్ఎస్ ఎంపీ సీటు పార్టీ క్యాడర్​లో చిచ్చు పెట్టింది. నిన్న మొన్నటి వరకు వంటేరు ప్రతాపరెడ్డికే మెదక్ టికెట్ ఖరారైనట్లు ప్రచారం జరగ్గా ఆఖరి నిమిషంలో ఎమ్మెల్సీ  వెంకట్రాంరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు  లోలోపల కొనసాగుతున్న వర్గపోరు ఒక్కసారిగా బయటకు వచ్చింది. తనకు టికెట్​ రాకుండా స్థానిక  నేతలు కొంతమంది అడ్డుపడినట్లు ప్రతాపరెడ్డి ఆరోపిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి  చెందిన బీఆర్ఎస్​నాయకుడు ఎలక్షన్ రెడ్డి వల్లే తనకు టికెట్​రాలేదని నేరుగా అతడిపై ఆరోపణాస్త్రాలు సంధించారు. స్థానిక నేతలు కొంతమంది తనగురించి కేసీఆర్​కు చెడుగా చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఎంపీ ఎన్నికల్లో ప్రభావం

బీఆర్ఎస్ టికెట్ చిచ్చు మెదక్​ఎంపీ సీటుపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు 45,031 మెజార్టీ లభించింది. ఇప్పుడు కూడా ఇక్కడ మెజార్టీ లభిస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నా గజ్వేల్​రాజకీయాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దీనికి తోడు నియోజకవర్గంలోని కొండ పొచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నిర్వాసితుల ఓట్లు భారీగా ఉండడంతో నేతల మధ్య అభిప్రాయ బేధాలు పోలింగ్ పై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తునాయి. సిద్దిపేట జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో గతంలో బీఆర్ఎస్ కు 1.80 లక్షల మెజార్టీ లభించింది. ప్రస్తుతం అంతకంటే ఎక్కువ మెజార్టీ సాధించాలని భావిస్తున్నా గ్రూపు తగాదాలు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంది.

పార్టీ మార్పు పై  ప్రచారాలు

మెదక్ ఎంపీ టికెట్ దక్కకపోవడంతో వంటేరు ప్రతాపరెడ్డి పార్టీ మారుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా 2018 లో కాంగ్రెస్ అభ్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించిన వంటేరు తర్వాత  బీఆర్ఎస్ లో చేరి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు.  గజ్వేల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నా ఎక్కువగా స్థానిక రాజకీయాలను ప్రతాపరెడ్డి పర్యవేక్షిస్తూ వచ్చేవారు. ఈ నేపథ్యంలో ఆయన ఆధిపత్యాన్ని  వ్యతిరేకించే వారు సెపరేట్ గ్రూపుగా విడిపోయారు. నిన్న మొన్నటి వరకు గుట్టుగా ఉన్న గజ్వేల్ గ్రూపు  రాజకీయాలు వంటేరు  ప్రతాపరెడ్డి ఆరోపణల నేపథ్యంలో బట్టబయలు కాగా ఆయన పార్టీలో కొనసాగుతారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

అప్రమత్తమైన కాంగ్రెస్ నాయకులు

వంటేరు ప్రతాపరెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో  చేరుతారనే  ప్రచార నేపథ్యంలో పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. మెదక్ బీఆర్ఎస్ టికెట్ వెంకట్రాంరెడ్డికి ఖరారు కాగానే కాంగ్రెస్ నేతలు ఆయనతో పాటు వంటేరు ప్రతాపరెడ్డి పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన వంటేరు  ప్రతాపరెడ్డిని మళ్లీ పార్టీలోకి రానివ్వమని ప్రకటించారు. గజ్వేల్ లో ఆయన  ప్రత్యర్థి డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి  ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి వంటేరును కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో వంటేరు ప్రతాపరెడ్డి సైతం డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి పై ఆరోపణలు సంధించారు.