
- రివైజ్డ్ డీపీఆర్ పంపి రెండు నెలలు గడిచినా ఆమోదించని కేంద్రం
- డెడ్ లైన్ పెట్టుకొని ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం
- ఆలోపు ఆమోదం లభించకపోతే సొంతంగా చేపట్టడంపై దృష్టి
- కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇచ్చేది 18 శాతం వాటానే
- మిగతా మొత్తం రుణం, రాష్ట్రంతోపాటు పీపీపీ వాటా అయినా
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్రం ఇంకా ఆమోదించకపోవడంతో ప్రాజెక్టు భవితవ్యంపై అయోమయం నెలకొన్నది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్–-2 విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
ఫేజ్-–2ఏ డీపీఆర్‌ను 2024 నవంబర్ 4న కేంద్రానికి పంపగా, అది అసంపూర్ణంగా ఉందని వెనక్కి వచ్చింది. ఆ తర్వాత, సవరించిన డీపీఆర్‌ను 2025 మేలో సమర్పించారు. ఫేజ్-2బీ డీపీఆర్‌ను 2025 జూన్ 20న పంపించారు. గత నెలలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. డీపీఆర్ పరిశీలనలో ఉందని తెలిపినప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. సీఎం రేవంత్ రెడ్డి జూన్ 19న కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కలిసి, మెట్రో ప్రాజెక్టుకు త్వరితగతిన ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఒక గడువు పెట్టుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. రాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం పాస్ చేసి.. కేంద్ర ప్రభుత్వానికి పంపాలని అనుకుంటున్నది. అయినా కేంద్రం నుంచి ఆమోదం లభించకపోతే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సొంతంగా చేపట్టాలని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే దానిపై కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది.
ఇచ్చేది కొంత మొత్తమే అయినా..
మెట్రో రెండో దశలో ఏ, బీ రెండు కేటగిరీలకు సంబంధించి రూ.43,848 కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర సర్కారు అంచనా వేసింది. ఒకవేళ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇందులో కేవలం 18 శాతం మాత్రమే అంటే రూ.7,892 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి రానున్నాయి. మెట్రో ఫేజ్-–2 ప్రాజెక్టులో కేటగిరీ 'ఏ'లో ఐదు కారిడార్లలో మొత్తం 76.4 కిలో మీటర్ల దూరం ఉండగా రూ.24,269 కోట్ల అంచనా వ్యయం వేశారు. కేటగిరీ 'బీ'లో మూడు కారిడార్లు ఉండగా.. మొత్తం 86.1 కిలో మీటర్ల దూరం రూ.19,579 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తారు. ఈ రెండింటికీ కలిపి తీసుకోవాలని అంచనా వేసిన రుణం రూ.21,091 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.13,154 కోట్లు భరిస్తుంది.
పీపీపీ మోడ్‌లో రూ.1,816 కోట్లు ఖర్చు చేయనుండగా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం రూ.7,892 కోట్లు మాత్రమే. మొత్తంలో 48 శాతం రుణం తీసుకోవాల్సి ఉండగా.. మరికొంత పీపీపీ మోడ్‌లో4 శాతం, మిగిలిన 30 శాతం రాష్ట్ర వాటా, ఇంకో 8 శాతం కేంద్రం భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కొంత మొత్తానికి కూడా సరైన సహకారం అందిచకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర, చెన్నై, బెంగళూరు మెట్రోలతో చిన్న నగరాలకు సైతం త్వరిత ఆమోదాలు ఇవ్వగా, హైదరాబాద్‌పై ఎందుకు వివక్ష చూపుతున్నారని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పుణె మెట్రో ఫేజ్-2కు త్వరిత ఆమోదం ఇచ్చి, హైదరాబాద్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని జులై 20న ‘‘మేడ్చల్ మెట్రో సాధన సమితి’’ ప్రధాని మోదీకి ఓ లేఖ రాసింది. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులతో కలిపి మొత్తం 9 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ఒత్తిడి చేయట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు మెట్రో ఫేజ్– 2కు కేంద్రం ఆమోదం తెలపకపోడం రాజకీయ వివక్షనేనని అధికార కాంగ్రెస్ పార్టీ పేర్కొంటున్నది
నగర అభివృద్ధికి మెట్రో ఫేజ్–2 కీలకం
మెట్రో రైల్ ఫేజ్-–1 2017లో ప్రారంభమైన తర్వాత, రోజువారీ 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తూ విజయవంతమైంది. అయితే, ఫేజ్–-2 ప్రాజెక్టు మాత్రం కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తూ ఆలస్యమవుతున్నది. మెట్రో రెండో దశ ప్రాజెక్టు కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా నగర అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి, పర్యావరణ సంరక్షణకు అత్యంత కీలకమైనదిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. కేంద్రం నుంచి త్వరితగతిన ఆమోదం లభిస్తే, 2025 చివరికి నిర్మాణం ప్రారంభమై, హైదరాబాద్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది.
ఒకవేళ సొంతంగా చేపట్టాల్సి వస్తే, రాష్ట్రంపై ఆర్థిక భారం గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ముందు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని.. ఆ తర్వాత రాష్ట్రం సొంతంగా చేపట్టడంపై పరిశీలించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ ఏడాది చివరలోగా ఎట్టి పరిస్థితుల్లో మెట్రో రెండో ఫేజ్‌ను పట్టాలు ఎక్కించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. మరోవైపు 2025 ఏప్రిల్‌లో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జికా)తో ఫండింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే, ఈ ప్రాజెక్టుకు ఇంకా కేంద్రం నుంచి ఆమోదం లేకపోవడం కూడా రాష్ట్ర సర్కారుకు నిధుల విషయంలో ఇబ్బందికరంగా మారింది.