క్యాబ్ డ్రైవరే ప్రధాన సూత్రధారి

క్యాబ్ డ్రైవరే ప్రధాన సూత్రధారి
  • రూ.40 లక్షల దోపిడీ కేసును ఛేదించిన సైబరాబాద్ పోలీసులు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ శివారు శంకర్‌పల్లిలో జరిగిన రూ. 40 లక్షల దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కేవలం 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితుడికి చాలా కాలంగా పరిచయమున్న క్యాబ్ డ్రైవరే  ఈ కేసులో  ప్రధాన నిందితుడని తేల్చారు. సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల12న రాకేశ్ అగర్వాల్ అనే వ్యాపారి.. తన మేనేజర్ సాయి బాబాను వికారాబాద్‌లోని కస్టమర్ నుంచి రూ. 40 లక్షలు తీసుకురమ్మని పంపించారు. సాయిబాబా తన ప్రయాణానికి మధు అనే ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్‌ను మాట్లాడుకున్నాడు.

 వికారాబాద్ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా హుస్సేన్‌పూర్ గేట్ వద్ద వారి కారును ఓ స్విఫ్ట్ డిజైర్ కారు అడ్డగించింది. అందులో నుంచి దిగిన ముగ్గురు వ్యక్తులు సాయి బాబాను కొట్టి, రూ. 40 లక్షలు తీసుకుని పారిపోయారు. అయితే, అనుకోకుండా దొంగలు ప్రయాణిస్తున్న కారు కొత్తపల్లి గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నిందితులు కారును అక్కడే వదిలేసి కాలి నడకన పారిపోయారు. చోరీ సమాచారం అందుకున్న శంకర్‌పల్లి పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు వదిలేసిన కారు ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఫ్రెండ్స్ తో కలిసి ప్లాన్

ఈ  దోపిడీకి ప్రధాన సూత్రధారి క్యాబ్ డ్రైవర్ మధు అని పోలీసుల దర్యాప్తులో   తేలింది. మధు గత కొంతకాలంగా సాయి బాబాకు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే సాయిబాబా భారీ నగదు తీసుకువెళ్తున్నాడని తెలిసి.. తన పాత స్నేహితులైన విజయ్ కుమార్, మొహమ్మద్ అజర్, హర్షలతో కలిసి పథకం వేశారు.  దారి మధ్యలో హుస్సేన్‌పూర్ గేట్ వద్ద, ట్రాఫిక్ తక్కువగా ఉండే ప్రాంతంలో దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. మధు నిరంతరం తన లొకేషన్‌ను విజయ్‌కి పంపుతూ నేరస్తులకు సహకరించాడు. పోలీసులు రాయికల్ టోల్ ప్లాజాల వద్ద తనిఖీలు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. క్యాబ్ డ్రైవర్ మధు,  రియల్ వ్యాపారి  విజయ్ కుమార్, కార్ డ్రైవర్లు అనుదీప్,  మొహమ్మద్ అజర్,  మరో రియల్ వ్యాపారి సలిన్ హర్షవర్ధన్, బౌన్సర్లు షమీమ్ ముల్లా,  దీపక్  ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి  రూ. 17.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన సైబరాబాద్ పోలీసులను పోలీస్ కమిషనర్ ప్రశంసించారు.