
- ఇటీవల చేరిన మోత్కుపల్లి, మందుల సామేల్లో ఒకరికి ఇవ్వాలని సీనియర్ల పట్టు
- ఉద్యమకారుడిగా, పార్టీ వాయిస్ వినిపించే బలమైన నేతగాదయాకర్కు పేరు
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ పై సస్పెన్స్ వీడడంలేదు. 2014,2018లో పార్టీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ రెండుసార్లు పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. మూడో సారి పోటీకి అద్దంకి రెడీగా ఉన్నా ఆయనకు టికెట్ రాకుండా నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్లు అడ్డుపుల్ల వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మునుగోడు బై ఎలక్షన్ టైంలో , అంతకుముందు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ లీడర్లపై తీవ్ర ఆరోపణలు చేయడమే ఇందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు, మందుల సామేల్నుంచి దయాకర్‌కు గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ అయిన రెండు జాబితాల్లో తుంగతుర్తి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అడ్డుకుంటున్న సీనియర్లు..
జేఏసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్‌లో బలమైన వాయిస్ వినిపించే నేతగా గుర్తింపు ఉంది. పార్టీ అధికార ప్రతినిధి హోదాలో కొన్నేండ్లుగా వివిధ వేదికలపై పార్టీ తరుపున బీఆర్ఎస్, బీజేపీలకు గట్టి కౌంటర్లు ఇస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీ కూడా తుంగతుర్తి నుంచి ఆయనకు 2014, 18 ఎన్నికల్లో అవకాశమిచ్చింది. రెండుసార్లూ బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చిన దయాకర్ సల్ప మెజార్టీ తేడాతో ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవకతవకలకు పాల్పడ్డారంటూ హై కోర్ట్ ను ఆశ్రయించారు. కాంగ్రెస్‌లో ప్రముఖ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉండటం, రేవంత్‌కు సన్నిహితుడు కావడంతో ఆయన పేరు మొదటి లిస్టులోనే ఉంటుందని అందరూ భావించారు. కానీ మొదటి రెండు లిస్టుల్లోనూ పేరు లేకపోవడంతో ఇంతకీ ఆయనకు టికెట్ వస్తుందా? రాదా? అని ఆయన అనుచరుల్లో టెన్షన్ మొదలైంది. సెకండ్ లిస్టు ప్రకటించే రోజే ఎంపీ కోమటిరెడ్డి ఆధ్వర్యంలో మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్‌లో చేరారు. తుంగతుర్తి టికెట్ పై సీనియర్ నేత ఇచ్చిన హామీతోనే ఆయన పార్టీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగ పడ్డ మందుల సామేల్ కూడా ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో నెల క్రితమే కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. వీరితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి సైతం టికెట్ ఆశిస్తున్నారు. సీనియర్లు దయాకర్‌కు వ్యతిరేకంగా ఉండటం, తాము అభయమిచ్చి పార్టీలో చేర్చుకున్న వాళ్లకు టికెట్లు ఇప్పించేందుకు హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తుండటం వల్లే తుంగతుర్తి టికెట్‌ను పెండింగ్‌లో పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు వచ్చిన పారాచూట్ లీడర్ల కోసం పార్టీ కోసం పనిచేస్తున్న తమ నేతకు టికెట్ ఇవ్వకపోవడం ఏమిటని దయాకర్ అనుచరులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.