సీఎంఆర్ఎఫ్ ​అప్లికేషన్లపై కన్ఫ్యూజన్

సీఎంఆర్ఎఫ్ ​అప్లికేషన్లపై కన్ఫ్యూజన్
  •    ఎమ్మెల్యేలు సిఫార్సులు పంపుతున్నా తీసుకోని ఆఫీసర్లు
  •    ఎన్నికల కోడ్ పేరుతో బంద్
  •    పేరుకుపోతున్న అప్లికేషన్లు.. బాధితుల అవస్థలు
  •    చెక్కులు పంపిణీ చేయొద్దు.. అప్లికేషన్లకు అభ్యంతరం లేదంటున్న ఎన్నికల అధికారులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్లపై గందరగోళం నెలకొన్నది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి అధికారులు సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లను తీసుకోవడం ఆపేశారు. దీంతో వేలకొద్ది అప్లికేషన్లు ఎమ్మెల్యేల దగ్గరే ఆగిపోతున్నాయి. మరికొన్నింటిని సీఎంఆర్ఎఫ్ సెక్షన్​లో ఎలాంటి ప్రాసెస్ చేయకుండా పక్కన పెట్టేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్​లో అత్యవసర పరిస్థితుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టినోళ్లు.. మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి సీఎంఆర్ఎఫ్ కోసం సిఫార్సు చేయించుకుంటున్నారు.

 ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లను పంపిస్తుంటే అధికారులు తీసుకోవడం లేదు. ఎలక్షన్ కోడ్ ఉందని.. ఇప్పుడు అప్లికేషన్లు తీసుకోవడం కుదరదని చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థంగాక బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కోడ్ టైంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేపట్టకూడదని గతంలో ఈసీ స్పష్టం చేసింది. అయితే సీఎంఆర్ఎఫ్ అనేది నిరంతర ప్రక్రియ.. అప్లికేషన్లు తీసుకునేందుకు ఎలాంటి అడ్డంకి లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి క్లారిఫికేషన్ కోసం తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని.. ఒకవేళ వస్తే ఆ విషయాన్ని స్పష్టం చేస్తామని అంటున్నారు.

అక్టోబర్ నుంచి ఇబ్బందులే

సీఎంఆర్ఎఫ్​కు గత అక్టోబర్ నుంచే ఇబ్బందులు వెంటాడుతున్నాయి. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో అప్లికేషన్లు, చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. పాలనలో కుదురుకొని గత నెల నుంచే ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లను ప్రభుత్వానికి పంపుతున్నారు. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో అధికారులు నిలిపివేశారు. వాస్తవానికి అప్లికేషన్ల ప్రాసెస్ నిలిపివేయాల్సిన అవసరం లేదు. కొత్తగా మొదటి సారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లకు సైతం ఎన్నికల కోడ్ ఉందని సీఎంఆర్ఎఫ్​ అప్లికేషన్లు ఎన్నికల తరువాత అని చెబుతున్నట్లు తెలిసింది. 

అధికారులు కొందరు మిస్ గైడ్ చేయడంతోనే ఇలా అవుతుందని సమాచారం. సీఎంఆర్ఎఫ్​కు అప్లై చేసుకోవాలంటే ట్రీట్మెంట్ తీసుకున్న ఆరు నెలలోపే బిల్లులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అక్టోబర్ నుంచి ఏదో ఒక రకంగా ఆగిపోతే.. ఇప్పుడు ఇలా ఆపేస్తే బిల్లుల టైం అయిపోతుందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ కోసం ఇప్పటికే అర్జీలు పెట్టుకున్న వారు సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దవాఖానల్లో చికిత్సలు పొంది ఒరిజినల్‌‌‌‌‌‌‌‌ బిల్లులతో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ద్వారా సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌కు సిఫార్సు చేయించుకున్న వారెందరో అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ కోసం నిరీక్షిస్తున్నారు.

పెండింగ్ బకాయిలు ఇటీవలే క్లియర్​

సీఎంఆర్ఎఫ్​కు సంబంధించి గత ప్రభుత్వం దాదాపు రూ.180 కోట్ల బకాయిలు లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉన్నది. సీఎంఆర్ఎఫ్​లో గోల్​మాల్ జరిగినట్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గుర్తించింది. దీంతో ఎవరెవరికి లబ్ధి జరిగింది? ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే దానిపై ఎంక్వైరీ చేయడంతో  కొంతకాలం చెల్లింపులు నిలిచిపోయాయి. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ కంటే వారం ముందు రూ.120 కోట్ల మేర పాత బకాయిలకు రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అందులో కొన్ని చెక్కులు పంపిణీ పూర్తి కాగా.. మరికొన్ని నిలిచిపోయాయి. ఇక చెక్కుల పంపిణీ మళ్లీ మొదలవ్వాలంటే లోక్​సభ ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందేనని ఆఫీసర్లు స్పష్టం చేశారు. జూన్ నెలలోనే చెక్కుల పంపిణీ ఉంటుందని చెబుతున్నారు.