రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటు విషయంలో గందరగోళం ఏర్పడింది. ఆమె ఒకరికి ఓటు వేయబోయి.. మరో అభ్యర్థికి ఓటు వేశారు. ఆ తర్వాత అప్రమత్తమైన సీతక్క.. ఓటు వేసేందుకు ఇంకో బ్యాలెట్ ను అడిగారు. దీంతో ఈ పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ లీగల్ ఒపీనియన్ అడిగారు. బ్యాలెట్ పత్రంలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము పేరు మొదట, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేరు తర్వాత ఉన్నాయి. ఓటింగ్ లో భాగంగా.. పోటీలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా వారి పేరు ఎదుట 1 అంకె వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కచ్చితంగా ఎన్నికల సంఘం ఇచ్చిన పెన్‌ను మాత్రమే వాడాలి. వేరే పెన్ ఉపయోగిస్తే లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు.
