- 12 ఏండ్లుగా రూ.12,500 ఫీజు అమల్లో..
- ఫీజుల పెంపు ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ
- సర్కారు నిర్ణయం కోసం వేచిచూస్తున్న స్టూడెంట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డీఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) అడ్మిషన్ల ప్రక్రియ మొదలైనా, ఫీజుల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ఒకవైపు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైనప్పటికీ, విద్యార్థులు ఎంత ఫీజు చెల్లించాలనే దానిపై విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో అడ్మిషన్లు పొందే అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రభుత్వ, 69 ప్రైవేటు డీఈడీ కాలేజీలు ఉన్నాయి.
వీటిలో ఫీజులను చివరిసారిగా 2014లో నిర్ణయించారు. అప్పటి నుంచి రూ. 11,000 ట్యూషన్ ఫీజు, రూ. 1,500 స్పెషల్ ఫీజు కలిపి మొత్తం రూ. 12,500 మాత్రమే వసూలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, గత పదేళ్లుగా ఖర్చులు పెరిగాయని, ఈ ఫీజులతో కాలేజీలను నిర్వహించడం కష్టమవుతోందని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా ఇతర ఫీజుల పేరుతో భారీగా వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఫీజులు పెంచకపోవడం వల్లే ఇలా చేయాల్సి వస్తోందని వారు చెబుతున్నారు.
పెండింగ్‌లో ప్రతిపాదనలు..
ఫీజుల పెంపుపై విద్యాశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల మాదిరిగానే డీఈడీ కాలేజీల్లో కూడా వసతుల ఆధారంగా ఫీజులను ఖరారు చేయాలని, దీనికోసం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) పరిధిలోకి డీఈడీని తీసుకురావాలని కోరింది. అయితే, దీనివల్ల ప్రభుత్వంపై ఎంత అదనపు ఆర్థిక భారం
పడుతుందో లెక్కలు తేల్చే పనిలో ఆర్థిక శాఖ పడింది. దీంతో ఈ దస్త్రం ప్రస్తుతం పెండింగ్‌లో పడింది.
నోటిఫికేషన్‌లో మెలిక..
ప్రస్తుతం కొనసాగుతున్న డీఈడీ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో విద్యాశాఖ ఒక మెలిక పెట్టింది. ఫీజుల పెంపు ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని, రాబోయే ఉత్తర్వులకు అనుగుణంగానే ఫీజులు ఉంటాయని అందులో పేర్కొంది. అంటే, ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వం పెంచబోయే ఫీజులను చెల్లించాల్సి ఉంటుందా? అనే భయం అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. ఫీజుల విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి వీడాలని అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. వెంటనే కొత్త ఫీజులను ఖరారు చేస్తారా లేదా పాత ఫీజులనే కొనసాగిస్తారా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
