బస్సులోంచి కారులోకి  మారిన వీవీ ప్యాట్​

బస్సులోంచి కారులోకి  మారిన వీవీ ప్యాట్​
  • వీవీ ప్యాట్ల తరలింపులో గందరగోళం
  • బస్సులోంచి కారులోకి మారిన వీవీ ప్యాట్​
  • కావాలనే మార్చారంటూ బీజేపీ ఆందోళన
  • అది పనిచేయని వీవీ ప్యాట్​: రిటర్నింగ్​ ఆఫీసర్​

కరీంనగర్, వెలుగు: శనివారం హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ బై పోల్‌‌‌‌‌‌‌‌ పూర్తయిన తర్వాత ఓ వీవీ ప్యాట్​ను ప్రైవేట్​ వాహనంలో తరలించడం గందరగోళానికి దారితీసింది.  వీవీ ప్యాట్​ను ఓ వ్యక్తి  కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని స్ర్టాంగ్ రూమ్‌‌‌‌‌‌‌‌కు కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​ అయ్యాయి. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎన్నికల అధికారులు, భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ నిలదీశాయి.  
ఏం జరిగింది..? 
పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు, వీవీ ప్యాట్లు,  రిజర్వ్ లో ఉన్న వీవీ ప్యాట్లు, ఇతరత్రా పోలింగ్ సామాగ్రిని కరీంనగర్ లోని ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్​కు బస్సుల్లో తరలించారు. అన్ని బస్సులు కరీంనగర్ కు  దాదాపుగా ఒకే సారి చేరుకున్నాయి. దీంతో ఎస్ ఆర్ ఆర్ కాలేజీ నుంచి కోర్టు  చౌరస్తా కింది వరకు బస్సులు నిలిచిపోయాయి.  బస్సులను ఒకటొకటిగా లోపలికి పంపించారు. ఆయా రూట్లకు సంబంధించిన సెక్టోరల్ ఆఫీసర్లు వారికి సంబంధించిన సామాగ్రిని అక్కడే అప్పగించాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఇల్లందకుంట ఏరియా సెక్టోరల్ ఆఫీసర్ అప్పటికే తన దగ్గర ఉన్న వీవీ ప్యాట్లను అప్పగించారు. అయితే  పోలింగ్ రోజు ఉదయం  పోలింగ్ స్టేషన్ నం. 200లో ఓ ఈవీఎం మొరాయించడంతో అక్కడ కొత్తది ఏర్పాటు చేశారు.  పనిచేయని వీవీ ప్యాట్ వీరి రూట్ బస్సులో ఉండిపోయింది. దీన్ని అప్పగించాలనే ఉద్దేశంతో బస్సులో ఉన్న వీవీ ప్యాట్ ను తీసుకురావాలని సదరు అధికారి తన డ్రైవర్ కు చెప్పారు. వెంటనే డ్రైవర్.. బస్సులో ఉన్న వీవీ ప్యాట్ ను తీసుకుని రోడ్డుకు అవతలి వైపున ఉన్న కారులోకి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న కొందరు ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో  తీశారు.  ఇవి కొన్ని క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.  
బీజేపీ నేతల ఆందోళన
వీవీ ప్యాట్లను ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే ఒక వాహనంలో నుంచి మరొక వాహనంలోకి  ఏవిధంగా తరలిస్తారంటూ ఆదివారం తెల్లవారుజామునే జడ్పీ మాజీ చైర్​పర్సన్​, బీజేపీ లీడర్​ తుల ఉమ, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయ శ్రీ తో పాటు పలువురు నాయకులు ఎస్ ఆర్ ఆర్ కాలేజీ గేట్ ఎదుట సుమారుగా మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం,  అధికార పార్టీ అండతోనే ఇదంతా చేస్తున్నారని వారు ఆరోపించారు. కలెక్టర్, సీపీని బదిలీ చేయాలంటూ డిమాండ్​ చేశారు.  ఈ నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్​లోని తెలంగాణ చౌక్‍లో నల్ల జెండాలతో నిరసనలు చేపట్టారు. ప్రజా తీర్పును స్వీకరించలేక ఈవీఎం అవకతవకలు, అక్రమాలతో టీఆర్‍ఎస్‍  కుట్ర చేస్తోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆరోపించారు. 

వదంతులను నమ్మొద్దు: రిటర్నింగ్ ​ఆఫీసర్​
వీవీ ప్యాట్​ తరలింపు విషయంలో వదంతులను నమ్మొద్దని రిటర్నింగ్ ఆఫీసర్​, ఆర్డీవో సి.హెచ్. రవీందర్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 200లో మాక్ పోలింగ్ సమయంలో ఓ వీవీ ప్యాట్ సాంకేతిక సమస్యతో మొరాయించిందని, దాని స్థానంలో సెక్టోరల్ అధికారి రిజర్వ్ లో ఉన్న వీవీ ప్యాట్​ అందజేశారని చెప్పారు. పోలింగ్ ముగిసిన అనంతరం రాత్రి ప్రిసైడింగ్ అధికారి, సెక్టోరల్ అధికారి, పోలింగ్ సిబ్బంది, ఎస్కార్ట్  పోలీసులతో ఆర్టీసీ బస్సులో ఈవీఎం యంత్రాలతో  కరీంనగర్ ఎస్ఆర్ఆర్  కాలేజీలోని రిసెప్షన్ సెంటర్ కు వచ్చారని తెలిపారు. పనిచేయని వీవీ ప్యాట్ ను రిసెప్షన్ సెంటర్ లోని గోడౌన్ లో అప్పగించేందుకు ఎదురుగా ఉన్న ఒక అధికారిక వాహనం నుంచి మరొక అధికార వాహనంలోకి డ్రైవర్​ తీసుకెళ్తున్న దృశ్యాలను అనుమానంతో కొందరు వీడియో తీసి వైరల్ చేశారని  చెప్పారు. పోలింగ్ లో వాడిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను ఎస్ ఆర్ ఆర్  కాలేజీలోని  స్ట్రాంగ్ రూంలో భద్రపరిచామని, దీనిపై ఎటువంటి అపోహలకు, సందేహాలకు తావు లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్యపు ప్రచారాలు నమ్మొద్దని కోరారు.