
- మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆరోపణ
హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని గిరిజన తెగల మధ్య విభేదాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ మాజీ ఎంపీ సీతారాంనాయక్ ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందని చెప్పారు. సోమవారం బీజేపీ స్టేట్ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 32 గిరిజన తెగలు ఉన్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలో గిరిజన జనాభా 10 శాతంగా గుర్తిస్తే, రేవంత్ రెడ్డి సర్కారు గిరిజనుల జనాభాను 11శాతంగా ప్రకటించడం ఆస్కార్ స్థాయి రాజకీయ డ్రామా అని మండిపడ్డారు.
గిరిజన తెగల జనాభాను రాజ్యాంగ ప్రాతిపదికన గుర్తించి, వారికి రావాల్సిన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సోయం బాపూరావు, తెల్లం వెంకట్రావును కాంగ్రెస్లో చేర్చుకున్నారని, ఇప్పుడు వారిద్దరూ సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారని వెల్లడించారు. మైదాన ప్రాంతాల్లోని 7% లంబాడీలను బెదిరించి, మిగిలిన 3% గిరిజన తెగల ప్రాతినిధ్యాన్ని పెంచాలన్న కుట్ర జరుగుతోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు.