
న్యూఢిల్లీ : వచ్చే సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. రెండు పార్టీలు పోటాపోటీగా యానిమేషన్ వీడియోలు రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవలే బీజేపీ ఓ వీడియో విడుదల చేయగా.. తాజాగా కాంగ్రెస్ ‘మొహబ్బత్ కీ దుకాన్’ (ప్రేమను పంచే దుకాణం) పేరుతో యానిమేషన్ వీడియోను రిలీజ్ చేసింది. ‘నఫ్రత్ కీ బజార్’ (విద్వేషాన్ని వ్యాప్తిచేసే బజారు) పేరుతో ఉన్న దుకాణం స్థానంలో ప్రేమను పంచే దుకాణాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓపెన్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇటీవలే దేశవ్యాప్తంగా ఆయన చేసిన భారత్ జోడో యాత్రను కూడా వీడియోలో చూపెట్టారు.
ఒక హిందూ, ముస్లిం మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా గొడవపెట్టి ఆనందించడం, అదే సమయంలో రాహుల్ వారి వద్దకు వెళ్లి గొడవపడకూడదని వారిని ఏకం చేయడం, విభజించు పాలించు పుస్తకాన్ని ప్రధాని మోదీ, అమిత్ షా కలిసి చదువుతున్నట్లు ఆ వీడియోలో చూపారు. అలాగే ప్రజాస్వామ్యం, మీడియా, బ్యూరోక్రసీలను ఓ రథంపై తాడుతో కట్టి మోదీ డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తున్నట్లు చూపారు. భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలను రాహుల్ ఏకం చేసినట్లు వీడియోలో ఉంది. ఆయన భారత్ జోడో యాత్ర చేస్తుండగా బ్యాక్ గ్రౌండ్లో అనారీ సినిమా ‘కిసీకీ ముస్కురాహటోంపే హో’ పాటను ప్లే చేశారు.
మోదీపై బీజేపీ యానిమేషన్ వీడియో
ప్రధాని మోదీపై బీజేపీ ఇటీవలే ఓ యానిమేషన్ వీడియో రిలీజ్ చేసింది. గుజరాత్ సీఎం నుంచి ప్రధాని వరకు ఆయన ప్రస్థానాన్ని అందులో చూపారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్, మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్ సింగ్ తదితరులు ఆయనపై చేసిన మాటల దాడిని ప్రస్తావించారు. ‘మౌత్ కా సౌదాగర్’, ‘చాయ్ వాలా’, ‘చౌకీదార్ చోర్ హై’ వంటి విమర్శలను ఆయన దీటుగా ఎదుర్కొని 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తీరును వివరించారు.