నీళ్ల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ద్రోహం : వెదిరె శ్రీరామ్

నీళ్ల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ద్రోహం : వెదిరె శ్రీరామ్
  •     కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ ఫైర్
  •     బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ‘నీళ్ల వాటాలు–నిజానిజాలు’ పై ప్రజంటేషన్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన కారణమే నీళ్లు, నిధులు, నియామకాలని,  కానీ.. రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు శ్రీరామ్ వెదిరె ఆరోపించారు. ఇందుకు గతంలో పాలించిన కాంగ్రెస్, పదేండ్లు ఏలిన బీఆర్ఎస్ పార్టీలదే బాధ్యత అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో కృష్ణా, గోదావరి జలాల కేటాయింపులు, వినియోగంపై ‘వాస్తవాలు–గణాంకాలు’ పేరుతో మంగళవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 

కాంగ్రెస్ విభజన చట్టంలో సెక్షన్ 89 పెట్టి అన్యాయం చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా బేసిన్​ను గాలికొదిలేసి, ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా చోద్యం చూసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు కేటాయిస్తే.. తెలంగాణ 200 టీఎంసీలు మాత్రమే వాడుకోగలిగిందన్నారు. 

రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ‘సెక్షన్-89’ను చేర్చడంతో.. పాత ట్రిబ్యునల్ కేటాయింపులను మార్చే అవకాశం లేకుండా పోయిందని, ఇది తెలంగాణకు ఉరితాడుగా మారిందన్నారు.  2015లో కృష్ణా జలాల పంపిణీపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తాత్కాలిక ఒప్పందం తెలంగాణ గొంతు కోసిందన్నారు. 

ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు: రాంచందర్ రావు

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గత 12 ఏండ్లలో తెలంగాణలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. సభలో, బయట రెండు పార్టీలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తున్నదన్నారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోమని, తాము తెలంగాణ పక్షాన ఉంటామన్నారు.