తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పొత్తు

తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పొత్తు

చెన్నై: లోక్ సభ ఎన్నికలకు తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్‌‌ మధ్య పొత్తు కుదిరింది. తాజాగా ఈ కూటమిలో హీరో కమల్‌‌ హాసన్‌‌ కు చెందిన మక్కల్‌‌ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ కూడా చేరింది. అయితే, ఎంఎన్ఎం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఆ పార్టీకి 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటును కేటాయించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు ఎలాంటి పదవులు వద్దు. దేశ సంక్షేమం కోసమే డీఎంకే కూటమిలో చేరాం. 

నేను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయను. కూటమికి మద్దతు ప్రకటిస్తున్నా” అని తెలిపారు. శనివారం సాయంత్రం డీఎంకే, కాంగ్రెస్ నేతలు భేటీ అయిన తర్వాత ఈ మేరకు కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన చేశారు.  ఒప్పందంలో భాగంగా తమిళనాడులోని 40 సీట్లలో డీఎంకే 21, కాంగ్రెస్ 10, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2,  ఎండీఎంకే 1, ఐయూఎంఎల్ 1, కేఎన్ఎంకే 1 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. పుదుచ్చేరి స్థానాన్ని కాంగ్రెస్ కు కేటాయించారు.