కాంగ్రెస్, లెఫ్ట్ పొత్తులపై డైలమా.. సీపీఎంకు వైరా సీటు ఇవ్వలేమన్న కాంగ్రెస్

కాంగ్రెస్, లెఫ్ట్ పొత్తులపై డైలమా.. సీపీఎంకు వైరా సీటు ఇవ్వలేమన్న కాంగ్రెస్
  • హైదరాబాద్​లో ఓ సీటు ఇస్తామని కొత్తగా ప్రపోజల్
  • కుదరదన్న సీపీఎం.. కాంగ్రెస్ తీరుపై సీరియస్
  • పొత్తుపై సీపీఐలోనూ పునరాలోచనలు
  • మిర్యాలగూడ, వైరా సీట్లు 
  • ఇస్తేనే కాంగ్రెస్​తో పొత్తు 
  • రేపటిలోగా తేల్చకుంటే సొంతంగానే పోటీ: తమ్మినేని  

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, లెఫ్ట్ పొత్తులు మళ్లీ మొదటికొచ్చాయి. సీపీఎంకు ఇస్తామని ప్రకటించిన సీట్లలో కాంగ్రెస్ మార్పులు చేసింది. దీంతో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. మరోవైపు సీపీఐ కూడా చెన్నూరు సీటు కేటాయించడంపై కొంత అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనే డైలమా నెలకొంది. సీపీఎం, సీపీఐతో పొత్తు కోసం కాంగ్రెస్ నేతలు నెల రోజులుగా చర్చలు జరుపుతున్నారు.

ఈ క్రమంలో సీపీఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లు.. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. చెన్నూరు సీటుపై అసంతృప్తితో ఉన్నప్పటికీ సీపీఐ ఓకే చెప్పింది. సీపీఎం చివరి వరకు పాలేరు సీటు కోసం పట్టుబట్టినప్పటికీ, ఆఖరికి ఆ పార్టీ కూడా పొత్తుకు ఒప్పుకుంది. అయితే ఆదివారం ఉదయం సీపీఎం నేతలతో మాట్లాడిన కాంగ్రెస్​ముఖ్య నేతలు.. వైరా సీటు ఇవ్వడం కష్టమేనని చెప్పారు.

హైదరాబాద్​పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఓ సీటు తీసుకోవాలని సూచించారు. ఇక్కడ మలక్ పేట, చార్మినార్ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. మలక్ పేట తీసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. ఈ ప్రపోజల్ పై సీపీఎం నేతలు సీరియస్​అయ్యారు. వైరా తప్ప, మరో సీటు తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. మంగళవారం లోపు ఏదో ఒకటి తేల్చాలని కాంగ్రెస్ కు అల్టిమేటం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​నుంచి పాజిటివ్ గా రిప్లై రాకపోతే పొత్తు కష్టమేనని తెలుస్తోంది. 

ఒంటరిగానా..  సీపీఐతో కలిసి పోటీనా?

కాంగ్రెస్​తో పొత్తు కుదరకపోతే సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తుందా లేక సీపీఐతో కలిసి పోటీ చేస్తుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సీపీఐకి కేటాయించిన సీట్లపై ఆ పార్టీలోనూ అసంతృప్తి ఉంది. చెన్నూరుకు బదులు మునుగోడు ఇవ్వాలని కాంగ్రెస్​కు సీపీఐ లేఖ రాసింది. ఈ క్రమంలో సీపీఎంతో కాంగ్రెస్ పొత్తు కటీఫ్ అయితే, సీపీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటదనేది ఆసక్తికరంగా మారింది. సీపీఎంతో కలిసి పోటీ చేయాలని సీపీఐలోని ఓ వర్గం ఇప్పటికే డిమాండ్ చేస్తోంది. మంగళవారం జరగనున్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పొత్తులపై నిర్ణయం తీసుకోనున్నారు.

వైరా ఇస్తేనే పొత్తు: తమ్మినేని  

ఖమ్మం, వెలుగు: మిర్యాలగూడ, వైరా సీట్లు కేటాయిస్తేనే కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకుంటామని, లేదంటే సొంతంగానే పోటీ చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. దీనిపై మంగళవారంలోగా కాంగ్రెస్ తేల్చకపోతే తమ దారి తాము చూసుకుంటామని స్పష్టం చేశారు. ఆదివారం సీపీఎం ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తు ధర్మం ప్రకారం ఇప్పటికే తాము ఎన్నో మెట్లు దిగామని, అయినా తమ పార్టీపై కాంగ్రెస్​నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు.

‘‘మొదట మిర్యాలగూడ, భద్రాచలం, పాలేరు, మధిర, ఇబ్రహీంపట్నం స్థానాలను మేం కోరాం. భద్రాచలంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో ఆ స్థానాన్ని త్యాగం చేశాం. మిర్యాలగూడ, పాలేరు ఇవ్వాలని కోరాం. ఇందుకు మొదట ఒప్పుకుని, మళ్లీ పాలేరు కుదరదని వైరా ఇస్తామని చెప్పారు. అందుకు కూడా మేం ఒప్పుకున్నం. మళ్లీ ఇప్పుడు వైరా కూడా సాధ్యం కాదంటున్నారు. వైరాకు బదులుగా హైదరాబాద్​లో ఏదో ఒక స్థానాన్ని ఇచ్చేందుకు పరిశీలిస్తున్నట్టు భట్టి విక్రమార్క ఫోన్​చేసి చెప్పారు. ఇట్లయితే పొత్తు కుదరదు. మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. ఆలోపు కాంగ్రెస్ క్లారిటీ ఇస్తేనే పొత్తు ఉంటుంది. లేదంటే మా దారి మేం చూసుకుంటం” అని చెప్పారు.