చెరో 125 సీట్లలో కాంగ్రెస్, ఎన్సీపీ పోటీ

చెరో 125 సీట్లలో కాంగ్రెస్, ఎన్సీపీ పోటీ

ముంబైమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తోన్న కాంగ్రెస్​, నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ(ఎన్సీపీ) మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్​ 125, ఎన్సీపీ 125 సీట్లలో పోటీకి దిగుతాయి. మిగిలిన 38 స్థానాల్లో యూపీఏ మిత్రపక్షాలకు కేటాయించారు. ఈ మేరకు ఎన్సీపీ చీఫ్ శరద్​ పవార్​ సోమవారం అధికారిక ప్రకటన చేశారు. ఎన్సీపీ తరఫున ఎక్కువ మంది కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తామని, కొన్ని చోట్ల సిట్టింగ్​ సీట్లను పరస్పరం ఎక్స్చేంజ్​ చేసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్​, ఎన్సీపీ నేతల సమావేశం తర్వాత పవార్​ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్సీపీ చీఫ్​ గత వారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్​ చీఫ్​ సోనియాతో చర్చలు జరిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీచేశాయి.

కాంగ్రెస్​ 42, ఎన్సీపీ 41 స్థానాల్ని గెల్చుకోగా, 122 సీట్లు సాధించిన బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 63 సీట్ల శివసేన సపోర్ట్​తో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. గతంలో విడివిడిగా పోటీచేసిన బీజేపీ, శివసేన ఈసారి కలిసే పోటీచేస్తామని ప్రకటించినా సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ కాంగ్రెస్​, ఎన్సీపీ నుంచి బీజేపీలోకి చేరికలు పెరిగాయి. ఎన్సీపీ ఎంపీ ఉదయన్‌రాజే భోస్లే బీజేపీలో చేరడంపై పవార్​ మండిపడ్డారు. కొంతమంది ఆత్మ గౌరవాన్ని కూడా తాకట్టుపెట్టి పార్టీ మారుతున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే వాళ్లకు బుద్ధి చెబుతారని పవార్​ అన్నారు. వంచిత్ బహుజన్ అఘాడి (ప్రకాష్ అంబేద్కర్), స్వాభిమాన్ షెట్కారి సంఘటన, సమాజ్‌వాదీ లాంటి పార్టీలు యూపీఏ కూటమిలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్​ నేత, మాజీ సీఎం పృధ్వీరాజ్ చవాన్ తెలిపారు.