అక్కంపేట సభతో మాటల వార్​

అక్కంపేట సభతో మాటల వార్​

వరంగల్‍, ఆత్మకూరు :  తెలంగాణ సిద్దాంతకర్త, ప్రొఫెసర్‍ జయశంకర్‍ సార్​ సొంతూరు హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట అభివృద్ధిపై కాంగ్రెస్‍, టీఆర్‍ఎస్‍ లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రైతు రచ్చబండ పేరుతో శనివారం కాంగ్రెస్‍ రాష్ట్ర చీఫ్‍ రేవంత్‍రెడ్డి జయశంకర్‍ ఊరిలో మీటింగ్‍ పెట్టడంతో ఈ అంశం హాట్​టాపిక్​గా మారింది. సీఎం కేసీఆర్‍ కావాలనే జయశంకర్‍ సార్‍ను తక్కువ చేస్తున్నాడని..ఆయన మీద కోపంతో అక్కంపేట డెవలప్‍మెంట్‍కు అడ్డుపడుతున్నారని రే వంత్‍ అనడంతో టీఆర్‍ఎస్‍  లీడర్లు భగ్గుమన్నారు. ఆదివారం ప్రభుత్వ చీఫ్​ విప్ ​దాస్యం వినయ్‍భాస్కర్‍, స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రెస్‍మీట్‍ పెట్టి రేవంత్‍పై ఫైర్‍ అయ్యారు. రౌడీ, స్మగ్లర్‍, బ్లాక్‍మెయిలర్, లుచ్చగాడంటూ కౌంటర్‍ ఇచ్చారు. దీంతో రేవంత్‍రెడ్డి ఆదివారం తన కొడంగల్‍ పర్యటనలోనూ ఈ అంశాన్ని లేవదీశారు. అక్కంపేట సమస్యలపై సీఎం కేసీఆర్‍కు బహిరంగ లేఖ రాశారు. ఇక..సోమవారం కాంగ్రెస్‍ పార్టీ ఆత్మకూర్‍ మండల లీడర్లు మళ్లీ మీడియా సమావేశం పెట్టి గులాబీ నేతలపై కామెంట్లు చేశారు. దీంతో ఈ అంశం ఎటుతిరిగి ఎటు వెళుతుందనే టెన్షన్‍ నెలకొంది.

అక్కంపేటతో మొదలు...
కాంగ్రెస్‍ ఏఐసీసీ నేత రాహుల్‍ గాంధీ వరంగల్‍ సభలో ప్రవేశపెట్టిన రైతు డిక్లరేషన్‍ను ఇంటింటికి తీసుకువెళ్లేందుకు. 'రైతు రచ్చబండ' కార్యక్రమాన్ని రేవంత్‍రెడ్డి జయశంకర్‍ సొంత గ్రామం అక్కంపేటలో మొదలుపెట్టారు. ఇక్కడి మీటింగ్​తో పాటు కొడంగల్‍ పర్యటనలో బహిరంగ లేఖలోను అంతేస్థాయి దూకుడుతో టీఆర్‍ఎస్‍పై ఫైర్‍ అయ్యారు. నాలుగు కోట్ల మంది జనాల్లో ఉద్యమ స్ఫూర్తినింపిన జయశంకర్‍ సార్ చరిత్రను సీఎం కేసీఆర్‍ కాలగర్భంలో కలిపే కుట్ర చేశాడని ఆరోపించారు. సార్‍ మీద కేసీఆర్‍కు విద్వేషం ఉందని, అందుకే ఆయనకు గుర్తింపు రాకుండా చేస్తున్నాడని మండిపడ్డారు. అందువల్లే అక్కంపేటను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తాగేందుకు మిషన్‍ భగీరథ నీళ్లు రాలేదని.. దళితులకు ఇండ్లు ఇవ్వలేదన్నారు. గ్రామాన్ని వరంగల్‍ జిల్లా నుంచి హనుమకొండకు మార్చి యువతకు ఉపాధి అవకాశాలు రాకుండా కుట్ర చేశాడని ఆరోపించారు. చివరకు జయశంకర్‍ విగ్రహం సైతం కొండా ఫ్యామిలీనే పెట్టించిందన్నారు.  మీటింగ్‍ కు వచ్చినవారితో కలిసి కేసీఆర్‍కు వ్యతిరేకంగా గాలిలో చెప్పులు చూపించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జయశంకర్‍ సార్​ పేరిట స్మృతివనం నిర్మించాలని, అక్కంపేటను రెవెన్యూ విలేజ్‍ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‍ చేశారు. 
చాలా అభివృద్ధి చేశామన్న టీఆర్‍ఎస్‍

రేవంత్ మాటలను ఖండించిన టీఆర్ఎస్ నేతలు : -
అక్కంపేట అభివృద్ధిపై రేవంత్‍రెడ్డి మాటలను టీఆర్‍ఎస్‍ లీడర్లు ఖండించారు. ప్రభుత్వ చీఫ్‍విప్‍ దాస్యం వినయ్‍భాస్కర్‍, లోకల్‍ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ అక్కంపేటను అన్నివిధాలా అభివృద్ధి చేశామన్నారు. గ్రామంలో రోడ్లు వెడల్పు చేసి, సెంట్రల్‍ లైటింగ్‍ పెట్టించినట్టు చెప్పారు. ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేశామన్నారు. రేవంత్‍ హైదరాబాద్‍ రౌడీలతో అక్కంపేటలో రచ్చబండ పెట్టారని ఆరోపించారు. రేవంత్​రెడ్డికి జనం ఇచ్చినట్టు చెబుతున్న గొర్రెపిల్ల కూడా కేసీఆర్‍ ఇచ్చిందే అని అన్నారు. బయటినుంచి టిఫిన్‍ తెచ్చుకుని దళితుల ఇంట్లో భోజనం అంటూ అబద్దాలు చెప్పాడని విమర్శించారు. సార్‍ మీద గౌరవంతోనే తాము భూపాలపల్లి జిల్లాకు, యూనివర్సిటీకి జయశంకర్‍ పేరు పెట్టామన్నారు. రేవంత్‍రెడ్డిని రౌడీ, స్మగ్లర్‍, బ్లాక్‍మెయిలర్‍, లుచ్చగాడంటూ కామెంట్లు చేసి పరకాలలో అడుగుపెడితే ఉరికిచ్చి కొడ్తారని వార్నింగ్‍ ఇచ్చారు. 

మేమే వంట చేసి పెట్టినం : -
ఆత్మకూరు : టీఆర్ఎస్​ లీడర్ల కామెంట్​పై రేవంత్​కు భోజనం పెట్టిన జానీ, లత దంపతులు, గొర్రెపిల్లను బహుమతిగా ఇచ్చిన నాగబోయిన దూడయ్య సోమవారం ఆత్మకూరులో స్పందించారు. ‘మేమే స్వయంగా వంట చేసి రేవంత్​రెడ్డికి పెట్టినం’ అని సిలువేరు జానీ, లత దంపతులు ప్రకటించగా,  ‘నా కష్టార్జితంతో పెంచి పెద్ద చేసిన గొర్రెపిల్లను కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో రేవంత్​రెడ్డికి ఇచ్చిన’ అని దూడయ్య చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన గొర్లు అక్కంపేటలో ఒక్కటి కూడా లేదన్నారు. ఆత్మకూరు కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు  కమలాపురం రమేశ్ ​మాట్లాడుతూ జయశంకర్ విగ్రహాన్ని అక్కంపేటలో పెడితే సార్‍కు గుర్తింపు వస్తుందనే కుట్రతోనే.. దామెర మండలం ముస్తాలపల్లిలో పెడుతున్నారన్నారు.