మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ దూకుడు

మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ దూకుడు

మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ..బై ఎలక్షన్పై దూకుడు పెంచింది. ఇప్పటికే అక్కడ భారీ బహిరంగసభను నిర్వహించి..ఎన్నికల శంఖారావాన్ని పూరించిన కాంగ్రెస్ ..త్వరలో మునుగోడు నియోకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి త్వరలో మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. ఇందులో భాగంగా నియోకవర్గంలోని మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిలను నియమించింది.

ఆరు మండలాలకు ఇద్దరు చొప్పున..
మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్, నారాయణ పూర్, మునుగోడు, నాంపల్లి, గట్టుప్పల్, చండూరు, మర్రిగూడ  మండలాలున్నాయి. ఒక్కో మండలానికి ఇద్దరు చొప్పున కాంగ్రెస్ ఇంచార్జిలను నియమించింది. చౌటుప్పల్ మండలానికి రాంరెడ్డి దామోదర రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డిలను ఇంచార్జిలుగా ఎంపిక చేసింది.  నారాయణ పూర్ మండలానికి బలరామ్ నాయక్, గండ్ర సత్యనారాయణలకు ఇంచార్జి బాధ్యతలను అప్పగించింది. మునుగోడు మండలానికి సీతక్క, విజయ రమణ రావులను నియమించగా.. నాంపల్లి మండల ఇంచార్జిలుగా అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవిలను ఎంపిక చేసింది.  గట్టుప్పల్ మండల బాధ్యతలు సంపత్ కుమార్,ఆది శ్రీనివాస్లకు..చండూరు మండల బాధ్యతలు ఎరావత్రి అనిల్, వంశీ కృష్ణలకు..,మర్రిగూడ మండల బాధ్యతలు చెరుకు సుధాకర్, వేం నరేందర్ రెడ్డిలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. 

కరోనాతో పాదయాత్ర వాయిదా..
మునుగోడు ఉప ఎన్నికను సవాల్గా తీసుకున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..చండూరులో సభలో పాదయాత్రను ప్రకటించారు. సభ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆగస్టు 13 నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే రేవంత్ రెడ్డికి కరోనా సోకడంతో..పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న రేవంత్ రెడ్డి..కొవిడ్ తగ్గిన తర్వాత పాదయాత్రను చేపడతారని తెలుస్తోంది.