- సూర్యాపేట, నల్గొండలో కాంగ్రెస్ నాయకుల సమావేశం
- ఉపాధి హామీలో గాంధీ పేరు తొలగింపుపై నిరసన చేపడతాం
సూర్యాపేట, నల్గొండ, వెలుగు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం2005ను రద్దు చేసి జీఆర్‌ఏంజీ 2025 పేరుతో బిల్లును తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు తెలిపారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. గాంధీ పేరును పథకం నుంచి తొలగించడం ద్వారా పని హక్కుపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తోందని ఆరోపించారు. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలన్న మార్పులతో ఈ పథకాన్ని రాష్ట్రాలకు భారంగా మార్చి రద్దు చేయాలన్న కుట్ర జరుగుతోందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ ఆదేశాల మేరకు జనవరి 20 నుంచి సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అంజలి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, పీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేశ్, నల్గొండ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, డీసీసీ కార్యదర్శి నాగుల వాసు,అక్కినపల్లి జానయ్య తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పై అక్కసుతోనే పేరు మార్చిండ్రు
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్ జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత డిమాండ్ చేశారు. శనివారం నల్గొండ పట్టణంలోని యాదవ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న అక్కసుతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చిందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్ , జిల్లా సీనియర్ నాయకులు కన్నారావు తదితరులు పాల్గొన్నారు.
