ఓటింగ్​ టైమ్​ పెంచండి.. ఈసీకి లెటర్​ రాసిన రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు

ఓటింగ్​ టైమ్​ పెంచండి.. ఈసీకి లెటర్​ రాసిన రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు
  • ఎండల దృష్ట్యా సాయంత్రం 6 గంటల వరకు ఓటేసే అవకాశం ఇవ్వాలని వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సమయం పెంచాలని ఈసీని కాంగ్రెస్​ కోరింది. ఈ మేరకు చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ రాజీవ్​కుమార్​కు ఏఐసీసీ మెంబర్, ఎలక్షన్​ కమిషన్​ కో ఆర్డినేషన్​ కమిటీ చైర్మన్​ నిరంజన్ శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించాలని అందులో పేర్కొన్నారు.  పోలింగ్‌ సమయాన్ని పెంచితేనే  ఓటింగ్‌ శాతం పెరుగుతుందని తెలిపారు. 

ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలోనూ సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్​కు అవకాశం ఇవ్వాలన్నారు. ఇప్పటికే ఎండలు బాగా పెరిగాయని, పోలింగ్​జరిగే మే 13 నాటికి జనం మధ్యాహ్నం టైమ్​లో బయటకు వచ్చే అవకాశం ఉండదని, సమయం పెంచితేనే అందరూ ఓటేసే వీలు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని మరో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఓటింగ్​కు అవకాశం ఇచ్చారని, ఆ అంశంపై మరోసారి రివ్యూ చేయాలని లేఖలో కోరారు.