2025 నవంబర్ 11న బిహార్ ఎన్నికల రెండో విడతతోపాటు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా 50% కన్నా తక్కువ మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. బిహార్‌లో సోనీ కుమారి ఓటింగ్ రోజునాడు ప్రసవమైన బాలింత. ఆమె కొన్ని గంటల్లోనే పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసింది. బాలింత సోనీ కుమారి ఉదాహరణ దేశమంతా గర్వపడే సంఘటన.
ఓటు వేయడం కేవలం హక్కు కాదు, అది దేశ పట్ల బాధ్యత అని ఆమె చూపించింది. అది హైదరాబాద్ జూబ్లీహిల్స్ వంటి అధిక విద్యావంతుల ప్రాంతాలకు ఒక చెంపపెట్టు లాంటిది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ పోలింగ్ రోజున సగం మందికంటే తక్కువ మంది మాత్రమే ఓటు వేశారు. ఇక్కడ అక్షరాస్యత రేటు 80% పైగా, కానీ ఓటింగ్ శాతం మాత్రం 50% దాటలేదు. దీనికి విరుద్ధంగా బిహార్ రాష్ట్రంలో అక్షరాస్యత కేవలం 60% అయినప్పటికీ 69% ఓటింగ్ నమోదైంది. ‘విద్య ఉన్నా ప్రజాస్వామ్య అవగాహన లేకపోతే ప్రయోజనం లేదు’ అని జూబ్లీహిల్స్ తక్కువ పోలింగ్ స్పష్టంగా చెపుతోంది.
ఓటు ఎగ్గొట్టి, జాలీ డే గడపడం మారాలి
హైదరాబాద్ ఓటర్లలో ఒక పెద్ద భాగం ఎన్నికల రోజున సెలవు, షాపింగ్, ఫుడ్ ఫెస్టివల్స్, బిర్యానీ పార్టీలు, సినిమాలకు వెళ్లడం వంటి వాటిలో గడుపుతున్నారు. ప్రజాస్వామ్య పండుగ అయిన పోలింగ్ రోజున ఇంత నిర్లక్ష్యం ఉండటం సిగ్గుచేటు. తమ ప్రాంతం అభివృద్ధి కావాలి, రోడ్లు బాగుండాలి, నీరు అందాలి అని కోరుకునేవారు ఓటు వేయడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఇది విచారకరం. బాధ్యతతోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఎవరిని గెలిపించాలో నిర్ణయించే శక్తి ప్రతి ఓటరుకి ఉంది. కానీ సగం మంది ఓటు వేయకపోతే, గెలిచిన వ్యక్తి నిజమైన ప్రజాప్రతినిధిగా పరిగణించడం సమంజసమేనా? ఇది ప్రజాస్వామ్యానికి హానికరం. తక్కువ ఓటింగ్ వల్ల చిన్న చిన్న వర్గాల ఓట్లు ఫలితాన్ని నిర్ణయిస్తాయి. దీనివల్ల ప్రజాస్వామ్యం బలహీపడుతుంది.
ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలి
రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటింగ్‌లో పాల్గొనడం తప్పనిసరి చేయడం గురించి ఆలోచించాలి. ఉదాహరణకు, పన్నులు చెల్లించనివారికి జరిమానా విధించినట్లు, రుణాలు తిరిగి చెల్లించని వారికి సిబిల్ స్కోర్ తగ్గించినట్లే, ఓటింగ్‌లో పాల్గొనని వారికి కూడా పౌర స్కోర్ (సిటిజన్ స్కోర్) విధానం ఉండాలి. అప్పుడే ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తారు.
ఇతర దేశాల ఉదాహరణలు
కొన్ని దేశాల్లో ఓటు వేయడం తప్పనిసరి. ఆస్ట్రేలియాలో ఓటు వేయకపోతే జరిమానా విధిస్తారు. సింగపూర్‌లో ఓటు వేయని వ్యక్తుల పేర్లు ఓటరు జాబితా నుండి
తొలగిస్తారు. బెల్జియం, అర్జెంటీనా వంటి దేశాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇలాంటి విధానం భారతదేశంలో కూడా తీసుకురావడం అవసరం. ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, మీడియా, సోషల్ వేదికలు కలసి ఓటు విలువను నిరంతర ప్రచారం చేయాలి. యువతకు ఓటు హక్కు మహత్తును నేర్పించాలి. ‘ఓటు వేయడం ఫ్యాషన్ కాదు, ఫౌండేషన్’ అని గుర్తు చేయాలి. హైదరాబాద్ నగర ఓటర్లు తమ వైఖరిని మార్చుకోవాలి. తమ నగరం, రాష్ట్రం, దేశం
బాగుండాలని కోరుకునేవారు ముందుగా ఓటు వేయాలి. సోనీ కుమారి లాంటి ఓ పౌరురాలి స్ఫూర్తిని అందరం అనుసరిస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఓటు వేయడం కర్తవ్యంగా కాకుండా గౌరవంగా భావించే రోజు రాక తప్పదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఓటు హక్కు నిర్లక్ష్యమైతే దేశం వెనుకడుగే!
- గజ్జెల భిక్షపతి,
పూర్వ ప్రభుత్వ న్యాయవాది
