అన్ని విభాగాల విద్యార్థులకు టీ-–సాట్ ఉద్యోగ సోపానంగా మారడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దేశంలో తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ సాంకేతికతను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్న టీ-–సాట్ ‘విద్యార్థుల వార్షిక పోటీలు-2025’ నిర్వహించి పేద విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయం. తెలంగాణ ప్రభుత్వం తరఫున టీ–సాట్ సేవలుప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా 99 శాతం మంది పేద విద్యార్థులే చదువుతారనేది వాస్తవం. కార్పొరేట్, ప్రయివేట్ విద్యా సంస్థలు తమ విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహిస్తూ వారిలోని ప్రతిభను వెలికితీస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా ఇదే తరహాలో పోటీ పరీక్షలు నిర్వహించి ప్రోత్సాహించాలనే లక్ష్యంతో టీ–సాట్ రాష్ట్ర వ్యాప్తంగా ‘విద్యార్థుల వార్షిక పోటీలు - 2025’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ విభాగాల్లో మండల, జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి మెరిట్ సర్టిఫికెట్లు అందజేసింది. వంద మందికిపైగా పాల్గొన్న రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నవంబర్ 4-–13 వరకు నిర్వహించిన పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 వేల మంది విద్యార్థులు పాల్గొనడమే టీ–సాట్పై ఉన్న ఆదరణకు నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం తరఫున టీ–సాట్ రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ ప్రయోజనకరంగా మారాలనే దీక్షతో సంస్థ సీఈవో వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పోటీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యఅందించడమే లక్ష్యం
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో టీ-–సాట్ తెలంగాణ ఉన్నత విద్యామండలితో అవగాహన కదుర్చుకుని విద్యార్థులకు పాఠ్యాంశాలు అందిస్తోంది. 3వ తరగతి నుండి 8వ తరగతి విద్యార్థుల కోసం 8 గంటల డిజిటల్ ప్రసారాలతో 1,710 గంటల కంటెంటును అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు రోజు 11 ఎపిసోడ్ల డిజిటల్ పాఠాలను ప్రసారం చేస్తూ 2,170 గంటల కంటెంట్ అందిస్తూ వారికి పరీక్షల్లో తోడ్పడుతోంది. ‘స్ఫూర్తి’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా స్వాతంత్య్ర సమర యోధులు, వివిధ రంగాల్లో ప్రముఖులు, అవార్డులు పొందిన వారి చరిత్రను విద్యార్థులకు అందిస్తోంది. ఇంటర్వ్యూల ద్వారా ప్రముఖుల అనుభవాలను యువత కోసం అందుబాటులోకి తెస్తుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలపై ప్రత్యేక వీడియోలతో బహు బాష నైపుణ్యం పెంచేందుకు టీ-–సాట్ చేస్తున్న కృషిపై విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారు. ‘విద్య’ పేరిట ప్రత్యేకంగా అందిస్తున్న కార్యక్రమాలు యువతకు గొప్ప వరంగా మారాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కోసం టీ-–సాట్ ప్రత్యేక యూట్యూబ్ ఛానళ్లు అందిస్తున్న విజ్ఞానం ప్రయోజనంగా ఉండడంతో వారికి కోచింగ్ సెంటర్ల ఖర్చులు తప్పుతున్నాయి. 23 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం భారీగా సుమారు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ ఉద్యోగాలు పొందిన యువతకు టీ-–సాట్ అందించిన వివిధ సబ్జెక్ట్స్ మెటీరియల్ ఎంతో తోడ్పడింది.
ఇంగ్లిష్ మాధ్యమంలోనూ మెటీరియల్స్
ఇంగ్లిష్ మాధ్యమంలో కూడా మెటీరియల్స్ అందించింది. గ్రూప్-1,2,3 ఉద్యోగాలతో పాటు, డీఎస్సీ, టెట్, ఆర్.ఆర్.బి, బ్యాంకింగ్, కేంద్ర ప్రభుత్వ ఎస్ఎస్సీతో పలు పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం అనుభవజ్ఞులైన ఫ్యాకెల్టీచే సమగ్ర కంటెంటును టీ–సాట్ తయారు చేయించింది. గ్రూప్-1 పరీక్షల కోసం సుమారు 750 గంటల 1200 ఎపిసోడ్స్, గ్రూప్-2 పరీక్షల కోసం 245 గంటల 300 ఎపిసోడ్స్, గ్రూప్-3 పరీక్షలకు 150 గంటల 300 ఎపిసోడ్స్ మెటీరియలుతోపాటు క్రాష్ కోర్సుగా ప్రత్యేక కంటెంట్ అందించింది. టెట్ పరీక్ష కోసం 105 గంటలకు సంబంధించి 199 పాఠ్యాంశాలను, డీఎస్సీ క్రాష్ కోర్సు కోసం 613 గంటలకు సంబంధించి 50 ఎపిసోడ్స్ ప్రసారం చేసింది. జనరల్ స్టడీస్పై ‘జనరల్ స్టడీస్ ఫర్ ఆల్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని పోటీ పరీక్షలకు హాజరయ్యే యువత కోసం టీ-సాట్ ప్రసారం చేస్తోంది. ఉద్యోగ పరీక్షలు రాస్తున్న వారికి విస్తృతమైన స్టడీ మెటీరియల్స్ అందించిన టీ-–సాట్ విద్యార్థుల విజయంలో భాగస్వామి అయ్యింది.
టీ-సాట్ తెలంగాణకు గర్వకారణం
తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాలు, సంస్థలతో టీ-–సాట్ అవగాహన కుదుర్చుకొని వారి సమన్వయంతో డిజిటల్ తరగతులను ప్రసారం చేస్తుండడంతో పలు రంగాలకు ప్రయోజనకరంగా మారింది. ఇందులో భాగంగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలతో ఎంఓయూ కుదుర్చుకుంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ సౌజన్యంతో ట్రావెల్ అండ్ టూరీజం మేనేజ్మెంట్ పాఠ్యాంశాలను రూపొందించింది. టీ-–సాట్, ఫొటానిక్స్, వ్యాలి కార్పొరేషన్ సంయుక్తంగా వీఎల్ఎస్ఐపై వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయి.
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ పశుసంవర్థక శాఖల సమన్వయంతో ‘నిపుణ’ పేరిట రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. ప్రజలకు వైద్య సలహాలు అందించేందుకు వైద్య నిపుణులతో ముఖాముఖి కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. టీ-సాట్ ఇప్పటివరకు ప్రజలకు ఉపయోగకరంగా సుమారు 38 వేలకు పైగా వీడియోలను అందుబాటులోకి తేవడంతో లక్షకు పైగా వ్యూస్, 8 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లతో అన్ని వర్గాల నుండి మన్ననలు పొందుతోంది. సంస్థ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఇది సాధ్యమైంది. టీ-సాట్ 16 శాటిలైట్ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 80 లక్షలకుపైగా కుటుంబాలకు డిజిటల్ ప్రసారాలను నేరుగా అందిస్తూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేరువయ్యింది. విద్యార్థులకు వరంలా మారిన టీ-–సాట్ విద్యా ప్రసార ఛానళ్లలో దాదాపు 5.9 మిలియన్ యూజర్లతో రికార్డు సృష్టించి దేశంలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణం.
ఆధునిక సాంకేతిక ప్రయోజనాలు అన్ని వర్గాలకు చేరాలనే దృఢ సంకల్పంతో అడుగులేస్తున్న టీ-సాట్ నిత్యం వినూత్న కార్యక్రమాలతో అందరికీ చేరువవుతోంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులన్నీ టెక్నాలజీతోనే ముడిపడి ఉన్న నేపథ్యంలో టీ-సాట్ తెలంగాణలో అన్ని వర్గాలకు వరంగా మారింది. ప్రధానంగా విద్యార్థులకు, యువతకు, మహిళలకు, రైతులకు ఇలా అందరికీ ఆధునిక సాంకేతిక ఫలాలు అందిస్తూ టీ-సాట్ చేదోడుగా నిలబడుతోంది. టెక్నాలజీని అన్ని వర్గాలకు విస్తరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న టీ-సాట్ దేశంలో నెంబరు 1 ర్యాంకుతో ఉత్తమ ఎడ్యుకేషన్ నెట్వర్క్గా నిలవడం తెలంగాణకు గర్వకారణం.
- ఐ.వి.మురళీ
కృష్ణ శర్మ,
