కొత్త అగ్రి చట్టాలను హడావుడిగా ఎందుకు తెచ్చినట్లు?

కొత్త అగ్రి చట్టాలను హడావుడిగా ఎందుకు తెచ్చినట్లు?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగిన రైతులు.. ఈ నెల 8న (మంగళవారం) దేశవ్యాప్త బంద్‌‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌‌కు కాంగ్రెస్ పార్టీ తన మద్దతును ప్రకటించింది. ‘డిసెంబర్ 8న జరిగే భారత్ బంద్‌‌కు మద్దతు తెలపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మా పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలు, నేతలు నిరసనలు తెలియజేస్తారు. కరోనా మహమ్మారి వ్యాప్తి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం హడావుడిగా జూన్‌‌లో ఈ చట్టాలను తీసుకొచ్చింది. సర్కార్‌‌కు అంత తొందరెందుకు? కరోనాతో దేశం మొత్తం ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యం విషయంలోనూ కూరుకుపోతున్న సమయంలో ఈ చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఏం వచ్చింది? ప్రభుత్వం తన వ్యాపార, కార్పొరేట్ మిత్రులకు సాయం చేసేందుకు వీటిని అర్జెంటుగా తీసుకొచ్చింది’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా పేర్కొన్నారు. ట్రాక్టర్ ర్యాలీలు, పలు క్యాంపెయిన్ల ద్వారా రైతుల నిరసనలకు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.