పంట పండింది : ఒక్కో ఓటుకు మూడు నుంచి ఐదు లక్షలు

పంట పండింది : ఒక్కో ఓటుకు మూడు నుంచి ఐదు లక్షలు

మహబూబ్​నగర్ ​లోకల్ ​బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్​ ప్రలోభాలకు తెరతీశాయి. ఈ ఎన్నికల ప్రభావం లోక్ సభ ఎన్నికలపై ఉంటుందనే అంచనాతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను లక్షలు పోసి కొంటున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్  పరిధిలో 1,439 ఓటర్లు ఉండగా, ఒక్కొక్కరికి  తక్కువలో తక్కువ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా ఆఫర్​ చేస్తున్నాయి. అప్పటికీ ఓటర్లపై నమ్మకం లేకపోవడంతో గోవా, కొడైకెనాల్, ఊటీ తదితర క్యాంపులకు తరలించిన పార్టీలు.. పోలింగ్ ​రోజే జిల్లాలో అడుగుపెట్టేలా ప్లాన్​ చేశాయి. మొత్తం మీద ఈ బైపోల్​ కోసం ప్రజాప్రతినిధులకు నజరానాలు సహా క్యాంపుల రూపంలో రెండు పార్టీలు ఏకంగా రూ.100 కోట్ల దాకా ఖర్చు పెడుతుండడం చర్చనీయాంశంగా మారింది.

ఓటుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,439 మంది లోకల్​బాడీ ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వారిలో ఎక్స్​అఫీషియో సభ్యులు 19 మంది పోను మిగిలిన 1,420 మందికి  క్యాండిడేట్లు పెద్దమొత్తంలో ఆఫర్​ చేస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ఓటుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తున్నట్లు సమాచారం. రెండు రోజులుగా ఆయా ప్రాంతాల్లో క్యాంపుల్లో ఉన్న ఓటర్లకు అక్కడే బయానా కింద  ఓటుకు రూ.1.50 లక్షల నుంచి రూ.2.5 లక్షల దాకా ముట్టజెప్పినట్లు సమాచారం. మిగిలిన డబ్బులను పోలింగ్​ రోజు ఇచ్చేలా అగ్రిమెంట్​ చేసుకున్నట్లు తెలిసింది. అప్పటి వరకు వీరంతా క్యాంపుల్లోనే ఉండేట్లు ఏర్పాట్లు చేశారు. 27వ తేదీ రాత్రి వారిని క్యాంపుల నుంచి తీసుకెళ్లి 28న  ఉదయం నేరుగా పోలింగ్​ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే 19 మంది ఎక్స్ అఫీషియో ఓటర్లకు కూడా పెద్ద మొత్తంలో ఆఫర్​ చేసినట్లు తెలిసింది. మొత్తం మీద ఇద్దరు అభ్యర్థులు కలిసి రూ.100 కోట్లకు పైనే ఖర్చు పెడ్తున్నట్లు భావిస్తున్నారు.