అలంపూర్, కేసముద్రం మున్సిపాలిటీల్లో..కాంగ్రెస్, బీఆర్ఎస్..ఫిఫ్టీ ఫిఫ్టీ

అలంపూర్, కేసముద్రం మున్సిపాలిటీల్లో..కాంగ్రెస్, బీఆర్ఎస్..ఫిఫ్టీ ఫిఫ్టీ
  • కీలకం కానున్న ఎక్స్​ అఫీషియో ఓట్లు

గద్వాల/కేసముద్రం, వెలుగు: పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​, బీఆర్​ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. దీంతో రెండు పార్టీలు సమానంగా సీట్లు దక్కించుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​, మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్​ఎస్​ పార్టీలకు చెరి సగం సీట్లు రావడంతో చైర్​పర్సన్​ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఆలంపూర్ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. 

పదో వార్డు ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 9 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అందులో ఐదు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో రెండు పార్టీలకు చెరి 5 సీట్లు వచ్చాయి. మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8 స్థానాలు దక్కించుకున్నాయి. దీంతో చైర్​పర్సన్​ పదవిని దక్కించుకునేందుకు ఇరు పార్టీలు పావులు కదుపుతున్నాయి. 

ఎక్స్​ అఫీషియో ఓట్లపై తర్జనబర్జన..

మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా కాంగ్రెస్​కు చెందిన మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, ఎంపీ పోరిక బలరాం ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇండిపెండెంట్​ సహకరిస్తే వీరు కేసముద్రం మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎక్స్ అఫీషియో సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు  రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు ఉన్నారు.

వీరు ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆలంపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకుంటే, బీఆర్ఎస్ తరఫున ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి  ఓట్లు నమోదు చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇదే జరిగితే బీఆర్ఎస్ గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి.