మంచిర్యాలలో ఇవ్వాల కాంగ్రెస్ ​ప్రచార సభలు

మంచిర్యాలలో  ఇవ్వాల కాంగ్రెస్ ​ప్రచార సభలు
  • ఇందారం చౌరస్తా నుంచి బైక్, కార్ ​ర్యాలీ 
  • సాయంత్రం 6గంటలకు నస్పూర్​లో కార్మిక గర్జన 
  • 7గంటలకు మంచిర్యాలలో ప్రజా ఆశీర్వాద సభ 
  • దీపాదాస్ మున్షీ, శ్రీధర్​బాబు సహా నేతలు హాజరు  
  • విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పీఎస్సార్​ పిలుపు 

మంచిర్యాల, వెలుగు: నస్పూర్, మంచిర్యాలలో శనివారం ఎన్నికల ప్రచార సభల నిర్వహణకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్​ఏర్పాట్లు చేసింది. ఈ సభలకు రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్​ మున్షీ, ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్​దుద్దిళ్ల శ్రీధర్​బాబు, ఆలిండియా యూత్​ కాంగ్రెస్​అధ్యక్షుడు శ్రీనివాస్​రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. 

సాయంత్రం 5గంటలకు ఇందారం చౌరస్తా నుంచి బైక్, కార్ ​ర్యాలీ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు నస్పూర్ మున్సిపాలిటీ అంబేద్కర్ నగర్​లో కార్మిక గర్జన సభ, 7గంటలకు మంచిర్యాల బైపాస్ రోడ్డు తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్ ​రావు శనివారం పరిశీలించారు. అంతకుముందు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రచార సభలను విజయవంతం చేయాలని కోరారు. 

కోడ్​ ఉల్లంఘించలే..

ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ తనపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని ప్రేమ్​సాగర్​రావు అన్నారు. తాను ఎలక్షన్ కోడ్​ను ఏనాడూ ఉల్లంఘించలేదన్నారు. ఓ ఆలయానికి విరాళం ఇవ్వడాన్ని వివాదాస్పదం చేయడం తగదన్నారు. తనపై కేసులు కొత్త కాదని, విద్యార్థి దశ నుంచి నేటివరకు ప్రజాక్షేత్రంలో ఎన్నో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు, డీసీసీ చైర్​పర్సన్ ​సురేఖ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్​లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ తదితరులు పాల్గొన్నారు.  

నేడు చలివేంద్రాలు ప్రారంభం..

 కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల, నస్పూర్​ మున్సిపాలిటీల్లో శనివారం చలివేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు ట్రస్ట్ సెక్రటరీ సత్యపాల్ రావు తెలిపారు. మంచిర్యాల బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలివాడ, రైల్వే ఓవర్​ బ్రిడ్జి, బెల్లంపల్లి చౌరస్తా, నస్పూర్ 
మున్సిపాలిటీ పరిధిలో నస్పూర్​ కాలనీ, సీసీసీ కార్నర్, శ్రీరాంపూర్​బస్టాండ్​వద్ద చలివేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు.