
చేవెళ్ల, వెలుగు : కేసీఆర్ పాలన రజాకార్ల రాక్షసత్వాన్ని తలపిస్తుందని చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పామేనా భీమ్ భరత్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రజల సొమ్మును దోచుకున్న బీఆర్ ఎస్ నేతలు ఓట్లు అడగడానికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. ఆదివారం చేవెళ్ల మండలంలోని దేవుని ఎర్రవల్లి, ఊరెళ్ల, మొండివాగు, మల్కాపూర్, కుమ్మెర, రావులపల్లి, ముడిమ్యాల తదితర గ్రామాల్లో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇండ్లు, నీటి ప్రాజెక్టులు వచ్చాయని, వాటిపై ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో పేదలకు దళిత బంధు, బీసీ బంధు, గృహాలక్ష్మి ఇచ్చారా.. ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను వెంటనే అమలు చేస్తామన్నారు. ప్రచారంలో సమన్వయ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.