ఒకే దేశం, ఒకే పన్ను.. 9 ట్యాక్సెస్ గా మారింది ..జీఎస్టీ సంస్కరణలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు

ఒకే దేశం, ఒకే పన్ను.. 9 ట్యాక్సెస్ గా మారింది ..జీఎస్టీ సంస్కరణలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు
  • మధ్యతరగతి ప్రజలు ఎనిమిదేండ్లు బాధపడ్డారు: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం  

 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలను ప్రతిపక్షాలు స్వాగతిస్తూనే.. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోదీ సర్కారు ‘‘ఒకే దేశం, ఒకే పన్ను’’ అనే నినాదాన్ని ‘‘ఒక దేశం, తొమ్మిది పన్నులు’’గా మార్చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఎనిమిదేండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మోదీ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగిందని ఖర్గే ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం 'కుంభకర్ణ నిద్ర' వీడి మేల్కొనడం మంచి విషయమేనంటూ ఆయన గురువారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 జీఎస్టీ కౌన్సిల్ పన్ను స్లాబులలో కీలక మార్పులు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. గత దశాబ్ద కాలంగా జీఎస్టీని సరళీకరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉందని ఖర్గే గుర్తుచేశారు. "మోదీ ప్రభుత్వం 'ఒకే దేశం, ఒకే పన్ను' అనే నినాదాన్ని 'ఒకే దేశం, తొమ్మిది పన్నులు'గా మార్చేసింది. 0%, 5%, 12%, 18%, 28% స్లాబులతో పాటు 0.25%, 1.5%, 3%, 6% ప్రత్యేక రేట్లను ప్రవేశపెట్టి గందరగోళం సృష్టించింది" అని ఆయన విమర్శించారు. 

తాము సరళమైన పన్నుల విధానంతో 'జీఎస్టీ 2.0'ను 2019, 2024 మేనిఫెస్టోలలోనే ప్రతిపాదించామని తెలిపారు. అలాగే, 2024 – 25ని బేస్ ఇయర్​గా తీసుకొని అన్ని రాష్ట్రాలకు 5 సంవత్సరాల పాటు పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఎందుకంటే రేట్ల తగ్గింపు వారి ఆదాయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఖర్గే పేర్కొన్నారు. 

ప్రజలు ఎనిమిదేండ్లు బాధలుపడ్డారు.. 

జీఎస్టీ విషయంలో ఎన్డీయే సర్కారు తప్పుడు నిర్ణయం కారణంగా ఎనిమిది సంవత్సరాలుగా మధ్యతరగతి, పేద ప్రజలు అనేక బాధలు పడ్డారని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అన్నారు. ఇప్పుడు సంస్కరణలు ప్రకటించినప్పటికీ ఎంతో ఆలస్యమైందని అన్నారు. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, జీఎస్టీ సంస్కరణలు చాలా కాలంగా వాయిదా పడ్డాయని అన్నారు.  "చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న జీఎస్టీ స్లాబ్‌‌లపై సవరణ ఇప్పుడు జరిగింది.  భారతదేశానికి, భారతీయులకు నిజంగా జీఎస్టీ పని చేస్తుంది" అని పేర్కొన్నారు.