- ప్రతిపక్షాలను ట్రాప్‌లో పడేసేలా కేంద్రం బిల్లులను తెస్తున్నది
- మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని ముద్ర వేయాలని చూస్తున్నదని ఫైర్
- కేంద్రం తీసుకురాబోయే
- 3 బిల్లులపై ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ
తెస్తున్న డీలిమిటేషన్ బిల్లును ఐక్యంగా వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయించిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. అయితే, మహిళా రిజర్వేషన్లను తాము వ్యతిరేకించడం లేదని క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్, 131 రాజ్యాంగ సవరణ– డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లులపై చర్చించేందుకు ఢిల్లీ రాజాజి మార్గ్‌లోని ఖర్గే నివాసంలో బుధవారం ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. దాదాపు 21 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.
కాంగ్రెస్ నుంచి ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, కపిల్ సిబల్ పాల్గొనగా.. ఎన్సీ నుంచి జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఎస్పీ నుంచి ఎంపీలు సాంతన్ పండే, రామ శంకర్, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, సంజయ్ యాదవ్ హాజరయ్యారు. సాగరిక ఘోష్ (టీఎంసీ), సర్ఫరాజ్ అహ్మద్(జేఎంఎం), సంజయ్ రౌత్ (శివసేన- యూబీటీ), సంజయ్ సింగ్ (ఆప్), అన్నై రాజా, సందోష్ కుమార్(సీపీఐ) తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు.
- 850 సీట్ల పెంపుతో మహిళా రిజర్వేషన్స్‌కు ముడి
మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కాదని ఖర్గే తెలిపారు.‘‘ప్రతిక్షాలను ట్రాప్‌లో పడేసేలా.. కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును 850 సీట్ల పెంపుతో ముడిపెట్టింది. ఎలాంటి నిబంధన పెట్టకుండా ఈ బిల్లుకు మద్దతిస్తున్నాం. కానీ.. వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం మహిళా రిజర్వేషన్ల బిల్లును డీలిమిటేషన్‌తో కలిపి తీసుకొస్తున్నది. డీలిమిటేషన్‌ను మేం వ్యతిరేకిస్తే.. రాజ్యాంగ సవరణ ఆగిపోతుంది. దీన్ని వాడుకొని మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేం వ్యతిరేకమనే ముద్రవేయాలని చూస్తున్నారు. 2010, 2023 లో కాంగ్రెస్ మద్దతుతో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది” అని అన్నారు.

