గాంధీ ఫ్యామిలీకి కళంకం తెచ్చేందుకే..రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జిషీటు: మల్లికార్జున్ ఖర్గే

గాంధీ ఫ్యామిలీకి కళంకం తెచ్చేందుకే..రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జిషీటు: మల్లికార్జున్ ఖర్గే
  • రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నవ్..ప్రధానిపై కాంగ్రెస్ చీఫ్​ ఖర్గే ఫైర్
  • రాజ్యాంగాన్ని ప్రజలు మార్చనివ్వరని కామెంట్

మైసూరు/బెంగళూరు: రాజ్యాంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్  చీఫ్​ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాజ్యాంగాన్ని బీజేపీ, ఆరెస్సెస్  మార్చే ప్రయత్నం చేస్తున్నాయని, కానీ.. దేశ ప్రజలు వారిని ఆ పని చేయనివ్వరని ఆయన పేర్కొన్నారు. మైసూరులో రూ.2,500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. అలాగే, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఖర్గే మాట్లాడారు. ‘‘రాజ్యాంగానికి సవరణలు చేయడం, తిరిగిరాయడంపై బీజేపీ, ఆరెస్సెస్  మాట్లాడుతున్నాయి. రాజ్యాంగాన్ని మార్చేందుకు మీరు (బీజేపీ, ఆరెస్సెస్) ఎంతైనా ప్రయత్నించండి. ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ఆ పని చేయనివ్వరు. ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చేందుకు వారిని అనుమతిస్తే ఈ దేశ ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండవు” అని ఖర్గే అన్నారు. 

రాజ్యాంగం వల్లే నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి అయ్యారని గుర్తుచేశారు. ‘‘మోదీ.. పార్లమెంటులోకి ప్రవేశించే ముందు రాజ్యాంగం ఎదుట నీవు తల వంచి నమస్కరించావు. ఈరోజు అదే రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నవు. మరోవైపు 42 దేశాల్లో నీవు (మోదీ) పర్యటించావు. కానీ.. అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ లో పర్యటించడానికి మాత్రం నీకు సమయం ఉండదు” అని ఖర్గే వ్యాఖ్యానించారు.

  • గాంధీ ఫ్యామిలీకి కళంకం తెచ్చేందుకే 
  • రాబర్ట్​ వాద్రాపై ఈడీ చార్జిషీటు

వాద్రా, గాంధీ కుటుంబాలకు కళంకం తెచ్చేందుకే ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్  వాద్రాపై ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసిందని ఖర్గే అన్నారు. శనివారం బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. వాద్రాపై పగ తీర్చుకునేందుకు, కాంగ్రెస్  పార్టీని టార్గెట్  చేసుకునేందుకే ఈడీ చార్జిషీటు వెనుక ఉన్న ఉద్దేశమని ఆరోపించారు. వాద్రా, గాంధీ కుటుంబాలకు చెడ్డపేరు తెచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా సఫలం కారని ఆయన పేర్కొన్నారు.