రైతుల కోసం కొట్లాడ్తం

రైతుల కోసం కొట్లాడ్తం

న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, బార్డర్ లో పరిస్థితులపై పార్లమెంట్ లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం టైమ్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ మండిపడ్డారు. ఈ అంశాలపై పార్లమెంట్ లో చర్చకు పట్టుబడతామని చెప్పారు. రైతులకు మద్దతుగా కొట్లాడతామన్నారు. బుధవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. రాహుల్ గాంధీ సహా పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడారు. పోయినేడాది చర్చ లేకుండానే అప్రజాస్వామిక పద్ధతిలో తెచ్చిన అగ్రి చట్టాలను, అదే పద్ధతిలో కేంద్రం రద్దు చేసిందని విమర్శించారు. ‘‘రైతుల విజయానికి సెల్యూట్. 700 మంది రైతుల ప్రాణ త్యాగాలను గౌరవిద్దాం. వారి డిమాండ్ల కోసం కొట్లాడుదాం” అని ఎంపీలకు పిలుపునిచ్చారు. తాము లేవనెత్తాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని, వ్యవసాయ సమస్యలపై గట్టిగా కొట్లాడాలని సూచించారు. బార్డర్ లో పరిస్థితిపై చర్చించేందుకు కేంద్రం నిరాకరిస్తోందని, బార్డర్ ఇష్యూపై పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. 

విచారం వ్యక్తం చేస్తే సరిపోదు... 
12 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని సోనియా అన్నారు. నాగాలాండ్ ఘటనపై స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తే సరిపోదు. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలి” అని చెప్పారు. ‘‘మోడీ సర్కార్ ఎకానమీని దెబ్బ తీస్తోంది. నోట్ల రద్దుతో మొదలెట్టి ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీలను అమ్ముతోంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, రైల్వే, ఎయిర్ పోర్టులు.. ఇలా అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తోంది. కొన్ని ప్రాజెక్టులపై కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తోంది” అని ఫైర్ అయ్యారు.

యూపీ మహిళల కోసం ‘శక్తివిధాన్’: ప్రియాంక
లక్నో: మరికొన్ని రోజుల్లో ఉత్తరప్రదేశ్​అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న వేళ కాంగ్రెస్​జనరల్​సెక్రటరీ ప్రియాంక గాంధీ మహిళల కోసం ప్రత్యేక మేనిఫేస్టో రిలీజ్​చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40% టిక్కెట్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రియాంక.. తాజాగా మరిన్ని హామీలు ప్రకటించారు. విద్య, వైద్యం, భద్రత, గౌరవం, స్వాభిమానం, స్వావలంబనం.. అనే 6 అంశాలు ప్రస్తావిస్తూ.. ‘శక్తివిధాన్’ పేరుతో కాంగ్రెస్​ ఆఫీస్​లో బుధవారం ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. “ఉత్తరప్రదేశ్‌లో మహిళా శ్రామిక శక్తిని పెంచడానికి, లింగ అసమానతలను తగ్గించడానికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఇవ్వాలనుకున్న 20 లక్షల కొత్త ఉద్యోగాల్లో 40% పోస్టులు మహిళలకు కేటాయిస్తం” అని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50% రేషన్​ దుకాణాల బాధ్యతలు, ఉపాధి హామీ పనుల్లో 40% పనులు మహిళలకు ప్రత్యేకంగా కేటాయిస్తామని ప్రియాంక తెలిపారు. పబ్లిక్ ట్రాన్స్‌ పోర్టేషన్‌లో డ్రైవర్లు తదితర వృత్తుల్లోనూ మహిళలకు 40% నిర్ధిష్ట కోటాను అమలు చేస్తామని  ప్రియాంక గాంధీ వివరించారు.